అనుకున్నట్టుగానే అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కుటుంబంతో తజకిస్తాన్ వెళ్లిపోయారు.ఆయన తన కోర్ టీంతో దేశాన్ని వీడారు. అటు ప్రభుత్వం లొంగిపోవాలని తాలిబన్లు అల్టిమేటం ఇచ్చారు. అధ్యక్షుడు వెళ్లిపోయాక… కాబూల్‌లోని అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. అటు ఆఘ్గన్ పరిణామాలతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆయా దేశాల రాయబారులు, సిబ్బందిని తరలించేసుకున్నారు. అటు భారత్ కూడా ఆఫ్ఘనిస్తాన్లోని పౌరులను రప్పించుకుంటోంది. 129మందితో ఆదివారంనాడు సాయంత్రం కాబూల్ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం గంటల్లో ఢిల్లీలోని అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకుంది. పౌరులతో పాటు దౌత్యవేత్తలను భారత్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కాబూల్ సైతం తాలిబన్ల వశం కావడంతో అమెరికా యుద్ధప్రాతిపదికన దౌత్యసిబ్బందిని తరలిస్తోంది. బోయింగ్ సీహెచ్-47 చినూక్, సికోర్‌స్కై యూహెచ్-60 హెలికాప్టర్లు కాబూల్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపైకి చేరుకొన్నాయి. ఆ తర్వాత కొద్ది సమయానికే ఆ కార్యాలయం మీద నల్లటి దట్టమైన పొగ కనిపించింది. రక్షణపరమైన కీలక పత్రాలు తాలిబన్లకు దొరక్కూడదనే ఉద్దేశంతోనే అమెరికా అధికారులు వాటిని దహనం చేసినట్టు సమాచారం.
20 ఏళ్లనాటి పరిస్థితులు ఆఘ్గనిస్తాన్లో మళ్లీ పునరావృతం అవుతున్నాయి. నెయిల్ పాలిష్ వేసుకుంటే చేతులు నరకడం, పురుషులతో కలిసి పనిచేస్తే రాళ్లతో కొట్టి చంపడం, బిగుతైన దుస్తులు ధరించినా చంపడం వంటి ఘటనలు మొదలయ్యాయి. 1998-2001 మధ్య కాలంలో ఆఫ్ఘన్ ను ఆక్రమించిన తాలిబన్ల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు మళ్లీ రాజ్యం తాలిబన్ల చెరలోకి వెళ్లడంతో పౌరులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.