ఇటీవల కాలంలో బయటినుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినడం బాగా ఎక్కువయింది. ముఖ్యంగా యువత చదువులు ఉద్యోగాలు వ్యాపారాల్లో బిజీ అయిపోవడంతో స్వయంగా వండుకొని తినేందుకు సమయం అవకాశం ఉండటం లేదు. దీంతో రెడీమేడ్ ఫుడ్ బాగా ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. అదే సమయంలో నాణ్యత కన్నా రుచి , హంగు ఆర్భాటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
బయట దొరికే ఆహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు సంచలన విషయాలు బయటపెట్టాయి.
దేశంలో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో సగటున 25శాతం వరకు కల్తీ జరుగుతున్నట్టు గుర్తించామని భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వెల్లడించింది. పాలు, వంట నూనెలు, మసాలాలు, టీ పొడి, పప్పులు, ఫోర్టిఫైడ్ రైస్ తదితర ఆహార పదార్థాల నాణ్యతా ఫలితాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ విడుదల చేసింది.ఈ నమూనాల విశ్లేషణ కు 239ప్రయోగశాలలు, 261 మొబైల్ ల్యాబ్లు వినియోగించినట్టు తెలిపింది.
ప్రధానంగా డైనింగ్ హాల్స్ లో హంగు ఆర్భాటాలు చేసే చాలా రెస్టారెంట్లు కిచెన్ లో వాడుతున్న పదార్థాలు పరిస్థితులను పట్టించుకోవడం లేదని తెలిసింది . అలాగే బయట కొనుక్కునే నిత్యవసర వస్తువులు కూడా చాలా వరకు నాసిరకంగా ఉంటున్నాయి. అలా అని చెప్పి.. అన్ని ప్రైవేటు సంస్థలని ఒక గాటిన కట్టేయడం తప్పు. చాలా సంస్థలు ఇప్పటికీ నాణ్యత కు కట్టుబడుతున్నాయి.
అందుచేత ఆహార విషయంలో నాణ్యతను సరిచూసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.