మళ్లీ ఆఫఘనిస్ధాన్ లో స్త్రీలకు, ఆడపిల్లలకు పూర్వం చీకటి రోజులు వస్తున్నాయా?
ప్రస్తుత పరిస్థితులు చూడబోతే అలాగే కనిపిస్తోంది. గత 20 సం.లుగా ఆఫ్గన్ ల రక్షణకై ఉన్న అమెరికా సేనలు తొలగిపోతూ ఉండడంతో ఇన్నాళ్లు కొండల్లో గుట్టల్లో తల దాచుకున్న తాలిబాన్ మూకలు ఆఫ్గనిస్తాన్ లో ఒక్కో ప్రాంతం తమ అధీనంలోకి తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒక అంచనా ప్రకారం మొత్తం 34 ప్రావిన్స్ లలో 12 వరకు తాలిబాన్ వశం అయ్యాయి. నేడో రోపో ఆఫ్గన్ ప్రస్తుత ప్రభుత్వం కూలి తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడడం తధ్యం. కానీ వాళ్ళు అమెరికాతో కుదుర్చుకున్న శాంతి ఒప్పొందం షరతుల మేరకు పరిపాలిస్తారా అంటే అనుమానమే?
స్త్రీలకు అన్ని హక్కులు ఇస్తాము అని పైకి చెపుతున్నా ఆచరణలో చూపిస్తారు అనే నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే గత వారం ఒక 16 సం.లు అమ్మాయి తల మీద హిజాబ్ వున్నా టైట్ జీన్స్ పేంట్ వేసుకుంది అని కాల్చి చంపారు. అలాగే భారత్ విలేఖరిని కూడా చంపారు.
అందుకే ఆఫ్గన్ స్త్రీలు, ఆడపిల్లలు మళ్లీ తాలిబాన్ పాలన అంటే భయంతో వణికి పోతున్నారు
2001 లో తాలిబాన్ పై అమెరికా నేతృత్వంలోని దండయాత్ర వరకు ఐదు సంవత్సరాల పాటు దేశాన్ని తాలిబాన్ మూక పాలించింది. ఆ సమయంలో ఆఫ్గన్ బాలికలకు విద్య, మహిళలకు పని చేసే హక్కును నిషేధించింది. అంతే కాక స్త్రీలు, ఆడపిల్లలు తోడుగా మగ బంధువు లేకుండా బయటకు రాకూడదు అని ఆంక్షలు పెట్టింది..తాలిబాన్లు బహిరంగ మరణశిక్షలను అమలు చేశారు, దొంగల చేతులు నరికారు. వివాహేతర సంబంధం ఉన్న మహిళలపై రాళ్లు రువ్వి చంపారు.
2001లో తాలిబాన్ల ప్రభుత్వం కూలిన తరువాత గత 20 సంవత్సరాలలో సాంప్రదాయిక పురుషుల ఆధిపత్య సమాజం నడుస్తున్నా బాలికలు పాఠశాలలో, మహిళలు పార్లమెంటులో ప్రభుత్వ ఉద్యోగాలలో మరియు వ్యాపారాలలో చేరగలిగారు.
అమెరికా తన చివరి దళాలను ఉపసంహరించుకోవడానికి ఇంకా రెండు వారాల గడువు వుంది. ఈ లోగానే తాలిబాన్ ఆఫ్గన్ రాజధాని కాబూల్ని నెమ్మదిగా అక్రమిస్తారు.
తాలిబాన్లు తమ కఠినమైన ఇస్లాం పాలన ప్రవేశ పెడతారు అనే భయంతో మే నెలాఖరు నుండి ఇప్పటివకూ దాదాపు 250,000 ఆఫ్ఘన్లు తమ ఇళ్లను వదిలి పారిపోయారని వారిలో 80 శాతం మంది మహిళలు మరియు పిల్లలు ఉన్నారని యునైటెడ్ నేషన్స్ పేర్కొంది.
“ఈ రోజు తాలిబాన్లు మళ్లీ అధికారంలోకి వస్తే, మేము అదే చీకటి రోజులకు తిరిగి వస్తామని నేను భావిస్తున్నాను” అని ఒక హక్కుల కార్యకర్త చెప్పారు.
తాలిబాన్ గతంలో అధికారం లో ఉన్నప్పుడు స్త్రీలపై అమలుపరచిన ఆంక్షలు:
1. ఆడపిల్లలు బయట ఏ విద్య సంస్థలో చదవకూడదు. తాలిబాన్ పాలనలో అన్ని బాలికల స్కూల్స్ ప్రార్ధనాలయాలుగా మార్చారు.
2. స్త్రీలు మోకాలు కనిపించే డ్రెస్ ధరించినా లేదా తాలిబాన్ నిర్దేశించిన డ్రెస్ ధరించక పోయినా, తండ్రి, భర్త, అన్నదమ్ముడు తోడు లేకుండా బయటకు వచ్చినా కొరడా దెబ్బలు.
3. సౌందర్య సాధనాలు వాడడం, బిగ్గరగా నవ్వడం, హై హీల్స్ ధరించడం, రేడియో, టివి లేదా పబ్లిక్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం, సైకిల్ మీద తిరగడం(భర్త వెనకాల కూడా) ఇంటి ముందు కానీ బాల్కనీలలో గానీ నిలబడ్డం శిక్షార్హమైన నేరం.
4. మగ డాక్టర్ల వద్దకు స్త్రీలు పోరాదు.
5. బయట చేయవలసిన ఏ పని అయినా మగ బంధువు తోడు లేకుండా వంటరిగా చేయడం నిషిద్దం
6. స్త్రీలు పరపురుషులను కలిస్తే రాళ్లతో కొట్టి చంపబడును
7. స్త్రీలు పరపురుషుడి కి వినిపించే అంత గట్టిగా మాట్లాడ కూడదు.
8. అలగే ఏ నిర్మాణానికి స్త్రీల పేరు ఉండకూడదు.
9. 15 సం.లు దాటిన బాలికలు, 45 సం.ల.లోపు విధవలు తాలిబాన్ యోధులను పెళ్ళిచేసుకోవాలి.
ఈ మధ్యే మనం ఇరాక్ లో యజడీ స్త్రీలు పడ్డ కష్టాలు గురించి తెలుసుకున్నాం. ఇక ఆఫ్గన్ స్త్రీలు, బాలికల వంతు.
బయటకు చెప్పరు కానీ మన దేశంలో ఉదారవాద మేధావులకు మనసులో ఆఫ్గన్ ప్రభుత్వం తాలిబాన్ చేతుల్లోకి రావాలని కోరిక. ఆఫ్గన్ పరిణామాలపై వీరు సోషల్ మీడియాలో
స్పందిస్తున్న విధానం చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే వీరికి ప్రథమ శత్రువు అమెరికా.
ఆఫ్గన్ స్త్రీలకు పిల్లలకు కనీస హక్కులు లభించేటట్లు అన్ని రాజ్యాలు, యునైటెడ్ నేషన్స్ అన్ని హక్కుల సంస్థలు తాలిబాన్ ప్రభుత్వంపై వత్తిడి తేవాలి.
రెండు అగ్ర రాజ్యాల అంటే రష్యా అమెరికా ఆధిపత్య పోరులో సర్వం నాశనం అయిపోయిన అమాయక ప్రజలు ఆఫ్గన్ దేశస్తులు.
….చాడా శాస్త్రి…