కర్నూలు జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులపై దాడిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సహా అన్ని మండల కేంద్రాల్లో బీజేపీ నిరసన ర్యాలీని నిర్వహించింది. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన శ్రీకాంత్ రెడ్డిపై కొందరు దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఆత్మకూరులోని పద్మావతీ పాఠశాల వెనక మసీదు నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఘర్షణకు దారితీసింది. అక్కడ అక్రమంగా మసీదు నిర్మిస్తున్నారంటూ బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో మరో వర్గం వారు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆయనికి నచ్చజెప్పి వెనక్కి పంపారు. ఆయన వెనుదిరుగుతున్న సమయంలో కొందరు వాహనాన్ని అడ్డుకుని దాడి చేసినట్టు అక్కడివారు చెబుతున్నారు. ఆందోళనకారుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కారు వేగంగా నడపడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. నిరసనకారులు వెంటపడడంతో ఆయన పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి రక్షణ కోరారు. నిరసనకారులు అంతటితో ఆగక స్టేషన్ ను దిగ్బంధించి శ్రీకాంత్ రెడ్డిపై హత్యాయత్నం చేయబోయారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. వారంతా పోలీస్ స్టేషన్ ను ముట్టడించడంతో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి ఇరు వర్గాల్ని చెదరగొట్టారు పోలీసులు.
అటు శ్రీకాంత్ రెడ్డి సహా పార్టీ నాయకులపై ఓ వర్గం దాడిని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. రక్షణ కోరుతూ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన నాయకుడిపై పోలీసుల సమక్షంలో దాడి చేయడం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోందని పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అక్రమంగా మసీదు నిర్మిస్తుంటే ప్రశ్నించిన వారిని తరుముతూ పోలీసుల సమక్షంలో దాడి చేయడమేంటని.. శ్రీకాంత్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితులను పట్టుకుని శిక్షించాలని బీజేపీ డిమాండ్ చేసింది.