దీదీకి మరో షాక్.. బెంగాల్ ఓటర్లకు ప్రధాని తీపి కబురు..!
బెంగాల్లో అధికార టీఎంసీని ఓడగొట్టి.. ఎలాగైనా అధికారం చేపట్టాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటుగా ఇతర మంత్రులు కూడా పర్యటిస్తున్నారు. స్మృతి ఇరానీ కూడా పలు ర్యాలీల్లో పాల్గొంటూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ఇక ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన యూపీ సీఎం యోగీ కూడా బెంగాల్లో ప్రచారం చేపడుతున్నారు. అయితే ఓటర్లను ఆకర్షించేందుకు మోదీ సర్కార్ రెడీ అయ్యింది. కార్మికులను ఆకర్షించేలా ముందడుగు వేసింది. జనపనార కనీస మద్దతు ధరను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ దీనికి సంబంధించి ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరకంటే 6 నుంచి 7 శాతం వరకు పెంచాలని నిర్ణయించింది. అయితే ఇలా జనపనారకు కనీస మద్దతు ధర పెంచడం ఇది రెండోసారి కావడం విశేషం.
అయితే నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరికి జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్రం ఇలా చేసి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశ వ్యాప్తంగా జనపనార మిల్లులు 70 ఉండగా.. అందులో 60 మిల్లులు బెంగాల్లోనే ఉన్నాయి.