తెలంగాణలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్‌రెడ్డి ఎపిసోడ్ ముగియకముందే కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్రవణ్ పార్టీ పదవి, సభ్యత్వానికి కూడా గుడ్ బై చెప్పారు. పీజేఆర్ కూతురు విజయారెడ్డి ఈ మధ్యే కాంగ్రెస్ గూటికి చేరారు. ఆమెకు వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు ఇస్తామని పీసీసీ పెద్దలు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామంపై దాసోజు శ్రవణ్ అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ తీరుపై దాసోజు శ్రవణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక పార్టీలో అరాచకాలు పెరిగాయన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కులం, ధనానికే ప్రాధాన్యం పెరిగిందని.. పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కుతున్నారని అన్నారు. పార్టీలో అగ్రవర్ణ కుల దురహంకారం ప్రదర్శిస్తున్నారని.. కాంగ్రెస్ కు ఎస్సీలు, బీసీలు దూరమయ్యారని.. బడుగులను అణగదొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార, రాజకీయ లబ్ధి పొందాలనేదే రేవంత్ రెడ్డి ఆరాటం. రేవంత్, మాణిక్కం ఠాగూర్, వ్యూహకర్త సునీల్ కుమ్మక్కయ్యారు. ప్రశ్నించినవారిపై హైకమాండ్‌కు తప్పుడు నివేదికలు అందిస్తున్నారని శ్రవణ్ పేర్కొన్నారు.