కామన్వెల్త్ గేమ్స్-2022లో చివరి రోజు బ్యాడ్మింటన్ లో భారత్ కు మరో స్వర్ణం దక్కింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు స్వర్ణం సాధించిన కాసేపటికే మరో స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ మరొక పసిడి పతకాన్ని గెలుపొందాడు. మలేషియా ప్లేయర్ ఎన్జీ జీ యోంగ్‌ను ఓడించాడు. తద్వారా పసిడి పతకం గెలిచాడు. లక్ష్య సేన్ కు కామన్వెల్త్ గేమ్స్‌లో ఇదే మొదటి టైటిల్.
గేమ్ లో తొలి సెట్‌ను 19-21తో ఓడిపోయిన సేన్.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. రెండో సెట్లోనూ తొలుత 8-9తో వెనకబడినప్పటికీ ఆ తర్వాత దూకుడు ప్రదర్శించి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆ తర్వాత ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా 21-9తో చేజిక్కించుకున్నాడు. మూడో సెట్లోనూ అదే జోరు కొనసాగించి 21-16తో స్టన్నింగ్ విక్టరీ సాధించి దేశానికి మరో స్వర్ణం అందించాడు.