సోమవారం మధ్యాహ్నం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అసలైన తెలంగాణ సంస్కృతిని తాము అనుసరిస్తున్నామని ఘనంగా చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అతిరథ మహారథులు వేంచేయగా.. థమన్ మ్యూజిక్ బ్రాండ్, సినిమా పాటలతో అదరగొట్టింది. ముఖ్యంగా గాయకులంతా బాలయ్య పాటలతో హంగామా చేశారు. డీజే సౌండ్లతో హోరెత్తించారు. ఇటు ఆహుతుల్లో ఉన్న మంత్రివర్గమంతా ఆ హంగామాకు ఉర్రూతలూగిపోయింది.
ఇక్కడ మరో విషయం గుర్తు చేసుకోవాలి. గతంలో తెలంగాణ తల్లి రూపాన్ని ఆభరణాలతో ఘనంగా తీర్చిదిద్దారు. ఆ నమూనాను మార్చేసి సాదాసీదాగా ఉండే తెలంగాణ తల్లి రూపం ఆవిష్కరించారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు.
మన కన్నతల్లి లా సాధారణంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తెలంగాణ తల్లిని అతి సాధారణంగా రూపొందించినట్లు వెల్లడించారు. ఆకుపచ్చ చీర, చేతిలో కంకులు, అభయహస్తం ఇంతే.
విగ్రహం సాదాసీదాగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఆవిష్కరణ ఉత్సవం కూడా అలాగే ఉండాలి కదా
ఆ సందర్భంగా నిర్వహించిన ఉత్సవాల్లో ఇంతటి భారీ తనం ఎందుకు..? కోట్లు ఖర్చు చేసి వేడుకల నిర్వహణ ఎందుకు..? ఆ డీజేల హోరు.. సినిమా పాటల వెకిలి చేష్టలు ఎందుకు..? తల్లి మాత్రం సాధారణంగా ఉండాలి కానీ, ఉత్సవాలు మాత్రం ఘనంగా నిర్వహించాలా..? ఇక డిసెంబర్ 9 న తెలంగాణ తల్లి దినోత్సవం ఎందుకో.. ఇంతవరకు ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. కేవలం సోనియాగాంధీ జన్మదినం కావడంతోనే.. ప్రజా ప్రభుత్వం నిర్ణయించడాన్ని ఎలా సమర్థించుకోవాలి..? ఇవన్నీ ప్రశ్నలే.
మొత్తం మీద గత ప్రభుత్వం అనేవాళ్ళు చెరిపేయాలి అన్న ఆరాటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరిన్ని తప్పులు చేస్తోంది అన్న మాట బలంగా వినిపిస్తోంది. అందుచేతనే ఇటువంటి పొరపాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.