స్వాతంత్ర సమరయోధుడు, నిస్వార్థమైన దేశభక్తులు అయిన టంగుటూరి ప్రకాశం జయంతిని ఆగస్టు నెల 23వ తేదీ జరుపుకుంటాము. నిరుపేద కుటుంబంలో జన్మించి అంచలంచెలుగా ఎదిగి, కేవలం చదువు , వృత్తి ద్వారా అపార కోటీశ్వరుడు గా ఎదిగారు. దేశం కోసం స్వాతంత్ర పోరాటం కోసం ఆస్తిని అంతా ధారపోసిన నిస్వార్థ పరుడు. ఆయన సేవలకు గుర్తింపుగా ఒంగోలు కేంద్రంగా ఉండే జిల్లాకు ప్రకాశం జిల్లా అని పేరు పెట్టారు.
టంగుటూరి ప్రకాశం జీవితం నేటి యువతకు ఎంతో ఆదర్శం. 1872 లో ఆగస్టు 23 న ప్రకాశం జిల్లా వినోదరాయుని పాలెంలో సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టి, అసాధారణంగా ఎదిగి, ప్రజలే ప్రకాశం, ప్రకాశమే ప్రజలు అనిపించుకున్న నిస్వార్థ జీవి. ప్రకాశం జీవితం, తెలుగు నాట స్వాతంత్ర్య ఉద్యమం వేరువేరు కావు. స్వాతంత్ర్య సమర యోధుడుగా ఎంతటి విజయాన్ని సాధించాడో, న్యాయవాదిగానూ వృత్తిలో అంతటి గెలుపు తీరాలు చేరాడు.
స్వాతంత్య్ర సమరయోధుడుగా ఉప్పు సత్యాగ్రహం, విదేశి వస్తు బహిష్కరణ, సైమన్ కమీషన్ వ్యతిరేకోద్యమం, క్విట్ఇండియా వంటి అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. మద్రాసుకు వచ్చిన సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ప్రకాశం నిరసన ప్రదర్శనను చేపట్టారు. నిరసనలో భాగంగా వాళ్లను చెల్లాచెదురు చేయటానికి పోలీసులు కాల్పులు జరిపారు.ఆ కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. ఆ యువకుని మృతదేహాన్ని సమీపించిన వారెవరినైనా కాల్చుతామని పోలీసులు హెచ్చరించడంతో… కోపోద్రిక్తుడైన ప్రకాశం బ్రిటష్ పోలీసుల తుపాకిలకు గుండెను ఎదురొడ్డి రండిరా ఇదె! కాల్చుకోండిరా అంటూ ఛాతి చూపి ధైర్యసాహసాలు ప్రదర్శించి పోలీసులకు ప్రతి సవాల్ విసిరారు. ఈ సంఘటన తరువాత ప్రకాశం గారి ధైర్యసాహసాలకు అచ్చెరువొందిన ప్రజానీకం ‘ఆంధ్ర కేసరి’ అని పిలిచి గౌరవించేవారు
ప్రకాశం ఎవ్వరినీ లెక్కచేసేవారు కాదు. ఏది సామాన్య ప్రజాహితమో దాని వైపే నిల్చొనేవారు.
అప్పట్లో రాజాజీ మంత్రి వర్గంలో రెవిన్యూ మంత్రిగా పనిచేశారు. మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగాను అధికార పీఠాన్ని అధిరోహించారు.1953లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశంనే ఎంచుకున్నారు. ఆయన పాలనా కాలం స్వల్పమే అయినప్పటికీ, సంక్షేమాలకు, సంస్కరణలకు పెద్దపీట వేశారు.స్వాతంత్ర్య సమరయోధునిగా ప్రకాశం పంతులు పేరు శాశ్వతంగా నేటికీ వెలుగొందుతూ ఉంది.
టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా ఒంగోలు జిల్లాకు ప్రకాశం పేరును పెట్టి ప్రకాశం జిల్లాగా మార్చారు. విజయవాడ వద్ద కృష్ణా నది పై నిర్మించిన బ్యారేజికి ప్రకాశం బ్యారేజిగా నామకరణం చేశారు. భారత తపాలాశాఖ ప్రకాశం జ్ఞాపకార్ధం స్టాంప్ ని విడుదల చేసింది.
విశ్వాసం గా దేశం కోసం పనిచేసిన టంగుటూరి ప్రకాశం జీవితం.. మనందరికీ ఆదర్శం. మనకోసం దేశం అన్న భావనతో బ్రతకడమే కాకుండా దేశం కోసం మనం అన్న ఆలోచన కూడా పెంచుకోవాలి.