ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి పూర్వ వైభవం రానుంది. రాజధాని నిర్మాణం పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. అమరావతిలో రాజధాని కట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.
అమరావతి లో కొత్త రాజధాని నిర్మాణం కోసం నిధుల సమీకరణ మీద కూడా చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.160 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ నిధులతో రాజధానిలో ఏపీ సీఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించను న్నారు. ఈ పనులకే తాజాగా సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రూ.160 కోట్లతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను చేపట్టిన సీఆర్డిఏ.. తర్వాత వైసీపీ రాకతో పనులను నిలిపివేసింది. అంతేకాదు.. అసలు సీఆర్ డీఏనే జగన్ సర్కారు రద్దు చేసింది. దీని స్థానంలో ఏపీఆర్ డీఏ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తూ.. సీఆర్ డీఏ చట్టంలో మార్పులు చేసింది. కానీ, కూటమి సర్కారు వచ్చాక.. మళ్లీ సీఆర్ డీఏ చట్టాన్ని పునరుద్ధరించారు. ఈ క్రమంలోనే ఈ నెల 16 తేదీన జరిగిన సీఆర్డిఏ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి తాజాగా ఆయా పనులను ప్రారంభించారు.
మరో వైపు ఇతర మార్గాలలో కూడా నిధుల సమీకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రం నుంచి రూ.15 వేల కోట్ల రూపాయలు రానున్నాయి. ఇవి రాగానే ప్రధాన పనులు కూడా ప్రారంభించనున్నారు.
మరోవైపు ఏషియా డెవలప్ మెంట్ బ్యాంకు(ఏడీబీ) కూడా రూ.15 వేల కోట్లను రుణం రూపంలో అందించ నుంది. ఈ మొత్తం నిధులతో వచ్చే ఏడాది చివరి నాటికి అమరావతికి ఒక రూపం తీసుకురావాలని చంద్రబాబు తలపోస్తున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి నిర్మాణంతో ఏపీకి పునర్ వైభవం కలుగుతుందని తెలియజేశారు. గత ప్రభుత్వం అమరావతి మీద కక్ష కట్టిందని రైతులను కూడా వేధించిందని ఆయన గుర్తు చేశారు. తీవ్రంగా పోరాటం చేసిన రైతు సోదరులు మహిళలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.