అనాథల అమ్మగా పిలిచే ప్రముఖ సామాజికకార్యకర్త సింధుతాయ్ సప్కల్ కన్నుమూశారు. మాయి అని అందరూ ప్రేమగా పిలిచే సింధును భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. 2వేల మంది అనాథపిల్లలను దత్తత తీసుకుని వారికి జీవితాన్నిచ్చారు సింధుతాయి.
సింధుతాయ్ మరణం పట్ల ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. ఆమె సమాజానికి, అనాథపిల్లలకు చేసిన సేవను కొనియాడారు. ‘సమాజానికి ఆమె చేసిన ఉదాత్తమైన సేవలు మరువలేనివి. ఎందరినో అక్కున చేర్చుకుని జీవితాన్ని ఇచ్చారు. అట్టడుగు వర్గాల ప్రజల కోసం ఆమె ఎంతో చేశారు. ఆమె మరణవార్త బాధించింది. ఆమె కుటుంబసభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓంశాంతి’ అని ట్వీట్ చేశారు.
మహారాష్ట్రలోని వార్ధాలో నిరుపేద కుటుంబంలో జన్మించిన సింధుతాయ్ అమ్మాయి అయినందుకు వివక్షకు గురయ్యారు. ఆడపిల్లకు చదువెందుకని పాఠశాలకు పంపేదికాదు తల్లి. కానీ తండ్రి ఆమెను ప్రోత్సహించాడు. కూతురు పశువులకు మేతకోసం వెళ్లిందని భార్యను నమ్మించి పాఠశాలకు పంపేవారు. 12 ఏళ్ల వయసులో 20ఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లిచేశారు. బాలికావధుగా అత్తగారింటికి వెళ్లిన ఆమె అక్కడ ఎన్నో కష్టాలు పడింది. భర్త నిత్యం వేధించేవాడు. కష్టాలను ఓర్చుకుంటూనే తోటి మహిళలపట్ల జరుగుతున్న అన్యాయాలు, దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించారు.
ఆమె 20 సంవత్సరాల వయస్సులో నాలుగోసారి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె భర్త అకారణంగా చితకబాది ఇంటినుంచి గెంటేశాడు.ఆమె చనిపోయిందనే అందరూ అనుకున్నారు. రక్తసిక్తమైన స్థితిలో పశువుల కొట్టంలోనే ఆడశిశువుకు జన్మనిచ్చింది సింధుతాయి. పుట్టింటికివెళ్తే తల్లి మరింత అవమానించిందే తప్ప ఆదరించలేదు. పసిబిడ్డను బతికించుకునేందుకు రైళ్లల్లో వీధుల్లో అడుక్కోవడం మొదలుపెట్టింది. తన బిడ్డను కాపాడుకునేందుకు రాత్రి పూట శ్మశానాలు, గోశాలలే సురక్షితమని అందులో గడిపింది. ఆ సమయంలోనే కొందరు అనాథలు ఆమెకు ఎదురయ్యారు. తన పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా… ఆరుగురు అనాథలను చేరదీసి యాచిస్తూనే వారికీ తిండిపెట్టింది.
1970 లో అమరావతిలోని చికల్దారాలో స్థానికుల అండతో ఓ అనాథాశ్రమాన్ని ప్రారంభించింది. తరువాత సావిత్రీబాయి పూలే బాలికల వసతి గృహాన్ని ప్రారంభించింది. సింధుతాయి జీవితమంతా అనాథల సేవకే అంకితం చేసింది. ఆమెను ప్రేమగా ‘మాయి’ (తల్లి) అని పిలుచుకునేవాళ్లు. ఆమె ఆశ్రయంలో పెరిగిన వాళ్లంతా బాగా చదువుకుని వైద్యులుగా, నాయ్యావాదులుగా ఇతర రంగాల్లో ఉన్నతస్థితిలో ఉన్నారు. తన కుమార్తె సహా మరికొందరు ఆమె బాటలోనే అనాథల సేవలో ఉన్నారు.
అనాథలసేవకే జీవితాన్ని అంకితం చేసిన సింధుతాయ్ ను పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు గుర్తించి సత్కరించాయి. లెక్కలేనన్ని అవార్డులు, పురస్కారాలు పొందారు. అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది భారతప్రభుత్వం. పద్మశ్రీతో నారీ శక్తి అవార్డును 2017లో రాష్ట్రపతి కోవింద్ చేతులమీదుగా అందుకున్నారు. 2010లో ఆమె బయోపిక్ ‘మీ సింధుతాయ్ సప్కల్’ విడుదలైంది.