దేశంలోని అతిపెద్ద కార్మిక సంఘంగా భారతీయ మజ్దూర్ సంఘ్ ని చెబుతారు. దీనిని స్థాపించిన దత్తాత్రేయ ఠేంగ్డే జీవితాంతం సామాన్య ప్రజల కోసమే పనిచేశారు.
దత్తాత్రేయ బాపురావు ఠేంగ్డే 10 నవంబర్ 1920న మహారాష్ట్రలోని వార్ధాలోని ఆర్వీలో జన్మించారు. ఆయన నాగ్‌పూర్‌లోని లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. మోరిస్ కాలేజీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 15 సంవత్సరాల వయస్సులో “వానర్ సేన” అధ్యక్షుడిగా, అలాగే ఆర్వీలోని మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు.
1936-38 నుండి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడు. 1942లో ఆర్ఎస్ఎస్ పూర్తికాల ప్రచారక్ అయ్యారు. 1950–51 వరకు ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్ టియుసి) మధ్యప్రదేశ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు. పోస్టల్ & రైల్వే వర్కర్స్ యూనియన్ (కమ్యూనిస్టు పార్టీ)తో అనుబంధం కలిగి ఉన్నారు. భారతీయ జనసంఘ్ మధ్యప్రదేశ్ (1952-53), దక్షిణ భారతదేశం (1956-57) ఆర్గనైజింగ్ సెక్రటరీ కార్యదర్శిగా పనిచేశారు.
గురూజీగా ప్రసిద్ధి చెందిన సంఘ్ ద్వితీయ సర్ సంఘచాలక్ మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ పండిట్. దీనదయాళ్ ఉపాధ్యాయ, బాబా సాహెబ్ అంబేద్కర్ ల ద్వారా విశేషంగా ప్రభావితులయ్యారు. 1942లో ఆర్ఎస్ఎస్లో ప్రచారక్‌గా చేరిన ఠేంగ్డేజీ 1942- 44 మధ్య కేరళలో, 1945-47లో బెంగాల్లో, 1948-49లో అస్సాంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా పనిచేశారు.
భారతీయ జనసంఘ్ స్థాపన సమయంలో 1951 నుండి 1953 వరకు సంఘటనా కార్యదర్శిగా సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించారు. అయితే, ఆ తర్వాత కమ్యూనిస్టుల పెట్టనికోటగా ఉంటున్న కార్మిక రంగంలో ప్రవేశించాలని సర్ సంఘచాలక్ గురూజీ సూచన మేరకు అప్పటి నుండి రాజకీయ రంగానికి దూరంగా, స్వతంత్ర కార్మిక ఉద్యమ నిర్మాణంలోనే గడిపారు.
దేశంలో అతిపెద్ద కార్మిక సంఘంగా చాలాకాలంగా ప్రభుత్వ గుర్తింపు పొందుతున్న భారతీయ మజ్దూర్ సంఘ్ (1955)తో పాటు భారతీయ కిసాన్ సంఘ్ (1979), స్వదేశీ జాగరణ్ మంచ్ (1991), సామాజిక సమరసత మంచ్, సర్వ-పంత్ సమదర్ మంచ్, పర్యవరణ్ మంచ్ వంటి అనేక ప్రసిద్ధ సంస్థలను స్థాపించారు. వాటికి మార్గదర్శకత్వం వహించారు, వాటి వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు.
అంతేకాకుండా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ ఆదివక్త పరిషత్, అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతీ, భారతీయ విచారణ కేంద్రం వంటి సంస్థలకు వ్యవస్థాపక సభ్యుడు కూడా. ఆయన ఎల్లప్పుడూ సమగ్రతను విశ్వసించారు. రాజకీయ అంటరానితనం ఆలోచనను తిరస్కరించారు.
అందుకనే, అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని సైద్ధాంతిక ఆలోచనలకు చెందిన వారు ఆయనను విశేషంగా గౌరవిస్తుంటారు. అత్యవసర పరిస్థితి కాలంలో లోక్ సంఘర్ష్ సమితి కార్యదర్శిగా దేశంలో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటానికి సారధ్యం వహించారు. ఆ తర్వాత ఏర్పడిన మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఏ పదవి కూడా స్వీకరించలేదు. కనీసం తన రాజ్యసభ సభ్యత్వం కొనసాగింపు కూడా కోరుకోలేదు.
1964-76లో రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఏ పదవిని స్వీకరించలేదు. ఆ తర్వాత వాజపేయి ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదు ప్రకటించినా స్వీకరించేందుకు నిరాకరించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. మరాఠీ, హిందీ, ఆంగ్ల భాషలలో అనర్గళంగా ప్రసంగించేవారు. ఆయనకు కొన్ని డజన్ల బిరుదులు ఉన్నాయి.
ఆయన పుణ్యతిధి సందర్భంగా నివాళులు.