పీవోకేలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ భద్రతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. చొరబాటుదారుల ఏరివేత, తీవ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనే అంశాలపై ఉన్నతాధికారులతో ఆయన చర్చించనున్నారు. అసలైతే ఆర్టికల్ 370 ఎత్తివేత తరువాత పాక్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని భద్రతాదళాలు సమర్థంగా అణచివేస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో సరిహద్దురేఖ వెంబడి పేలుడుపదార్థాలను అక్రమంగా భారత్ లోకి రవాణా చేస్తున్నారు. రాడార్ కళ్లుకప్పి డ్రోన్ల ద్వారా వాటిని తరలిస్తుండగా భద్రతాదళాలు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. పారామిలిటరీ బలగాలు, ఆర్మీ, స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటున్నాయి. అయినా లష్కర్-ఇ-తయిబా, జైష్-ఇ-మొహమ్మద్ గ్రూప్‌లకు ఆయన తీవ్రవాదులు ఇంకా యాక్టివ్గానే ఉన్నట్లు సమాచారం. ఈ అన్ని అంశాలపైనా అమిత్ షా సమీక్షచేసే అవకాశం ఉంది.