దళితవాదులు అన్న ముసుగులో అబద్దాలు ప్రచారం చేయటం సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. జై భీమ్… జై మీమ్ పేరుతో దేశ ద్రోహులకు దళితులను దగ్గర చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఇందుకోసం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును బలంగా వాడుకొంటున్నారు. మనదైన భారతీయ సంస్క్రతి, మనదైన భారతీయ సంస్థల ను అంబేద్కర్ దూషించినట్లు ప్రచారం చేసేస్తున్నారు. ఈ వంకతో ఆయా వ్యవస్థలు, ఆయా సంస్థల మీద బురద చల్లేస్తున్నారు.
ఉదాహరణకు భారత దేశ ఔన్నత్యం కోసం వందేళ్లుగా కృషి చేస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. స్వయం సేవక్ లు అనే స్వచ్ఛంద కార్యకర్తల సముదాయంగా దీనిని చెప్పవచ్చు. అంతటి గొప్ప సంస్థ గురించి డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ చాలా గొప్పగా వర్ణించారు. అంతే కాదు, ఆయన స్వయంగా ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాలకు కూడా హాజరు అయ్యేవారు. ఈ విషయం గురించి అనేక చారిత్రక గ్రంథాలలో కనిపిస్తోంది.
అంబేద్కర్ శిబిర సదర్శనాన్ని గురించి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ సన్నిహితుడు బాలా సాహెబ్ సాలుంకే అభివర్ణించారు. ఆయన అప్పట్లోనే పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. అంబేద్కర్ ను చాలా దగ్గర నుంచి గమనించిన అనుభవాలతో ఆయన పుస్తకాలు రచించారు. ఆ పుస్తకాల్లోనే అంబేద్కర్ కు ఆర్ ఎస్ ఎస్ తో ఉన్న అనుబంధం గురించి స్పష్టమైన వర్ణన కనిపిస్తుంది.
అంబేద్కర్ కు సన్నిహితులైన బాలాసాహెబ్ జీవిత విశేషాల గురించి వారి కుమారుడైన కశ్యప్ సాలుంకే, భానుదాస్ గయక్వాడ్ తో కలిసి `ఆంచే సాహెబ్’(మా సాహెబ్) అనే పుస్తకాన్ని వ్రాసారు. అందులో అంబేద్కర్ ఆర్ ఎస్ ఎస్ శిబిర సందర్శన గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. అంబేద్కర్ తోపాటు బాలాసాహెబ్ సాలుంకే కూడా శిబిరానికి వెళ్ళినవారిలో ఉన్నారు. పుస్తకంలోని 25, 53 పేజీ లలో అంబేద్కర్ శిబిర సందర్శన వివరాలు ఉన్నాయి.
మొదటగా 25వ పేజీ ని గమనిద్దాం. `డా. బాబాసాహెబ్ అంబేద్కర్, డా. హెడ్గేవార్ (ఆర్ ఎస్ ఎస్ స్థాపకులు) పుణెలోని భావుసాహెబ్ గడ్కరి ఇంట్లో కలుసుకున్నారు. మమ్మలందరిని (బాలాసాహెబ్ సాలుంకేతో పాటు) శ్రీ భావుసాహెబ్ అభ్యంకర్ (ఆర్ ఎస్ ఎస్) వేసవి శిబిరానికి తీసుకువెళ్లారు. అక్కడ డా. అంబేద్కర్ స్వయంసేవకులను ఉద్దేశించి సైనిక క్రమశిక్షణ, వ్యవస్థ గురించి ప్రసంగించారు’ అని వ్రాసారు.
53వ పేజీలో మరింత వర్ణన కూడా కనిపిస్తుంది. `అణచివేతకు గురైన వర్గాల ఉద్ధరణ కోసం పనిచేస్తున్న ఇద్దరు మహాపురుషుల సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. 1939.5.12న పూణేలోని భావుసాహెబ్ గడ్కరి ఇంట్లో (ప్రతాప్‌గడ్) పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపకులు పూజ్య డా. హెడ్గేవార్ లు కలుసుకున్నారు’ అని వ్రాసారు.
దీనిని బట్టి అంబేద్కర్ మహాశయులు అనేక సార్లు ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అని అర్థం అవుతుంది. అంతే కాకుండా, సంఘ్ పెద్దలు డాక్టర్ హెడ్గేవార్ తో చక్కటి సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇది నూటికి నూరుపాళ్లు రుజువైన వాస్తవం.
అయినప్పటికీ, ఈ తుక్డే గ్యాంగ్ మాత్రం ఆర్ ఎస్ ఎస్ ను, సంఘ్ వివిధ క్షేత్రాలను అంబేద్కర్ దూరం పెట్టారు అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఆర్ ఎస్ ఎస్ అగ్రవర్ణాల సంస్థ అని, నిమ్న వర్గాలను దగ్గరకు తీసుకోలేదని కూడా బురద చల్లుతుంటారు. ఇటువంటి చారిత్రక గ్రంథాలను చదివినట్లయితే అసలు వాస్తవాలు అర్థం అవుతూ ఉంటాయి.