చరిత్రలో కొందరి పేర్లు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. 60 ఏళ్లు 70 ఏళ్లు తమ జీవితాల్ని సమాజం కోసం పనిచేసినప్పుడు వాళ్ళని గుర్తు పెట్టుకుంటారు. కానీ 30 ఏళ్ల లోపే తనువు చాలించిన అల్లూరి సీతారామరాజు ఎప్పటికీ జరుగు ప్రజలకు గుండెల్లో నిలిచే ఉంటారు.
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానం తెలుసుకుందాం.
అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ల మీద పోరాటం చేశారు. ఎక్కడో మారుమూల అడవుల్లో గిరిజన పుత్రులు కష్టాలు పడుతున్నారని చూసి వాళ్ల కోసం బ్రిటిష్ వారిని ఎదిరించారు చివరికి జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన పుట్టింది పెరిగింది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం దగ్గర్లో. కానీ దేశమంతా పర్యటించి చివరికి ఏజెన్సీ చేరుకున్నారు. 1897 జులై 4న మోగల్లు గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. 16 సంవత్సరాలు దాటాక ఆయన దేశ పర్యటన చేపట్టారు. కలకత్తాలో సురేంద్రనాథ్ బెనర్జీని కలుసుకుని స్వతంత్రపోరాటంలో భారత జాతీయ కాంగ్రెస్ పాత్రను తెలుసుకుని లక్నోలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో పాల్గొన్నాడు. కాశీలో సంస్కృత భాషను అధ్యయనం చేసాడు. బదరీనాథ్, గయ, హరిద్వార్ దర్శించి బ్రహ్మకపాలంలో సన్యాస దీక్ష స్వీకరించాడు. ఆయుర్వేదము, విలువిద్య, గుర్రపుస్వారీ, యోగా, సంస్కృతము, హిందీ నేర్చుకున్నాడు.
దేశాటన అనంతరం విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కృష్ణదేవిపేట చేరుకొని అక్కడి కాళికాలయంలో ఉంటూ సన్యాస సాధన కొనసాగిస్తూ, అక్కడి ప్రజల సమస్యలపై దృష్టి సారించి, అమాయకులైన గిరిజనులపై బ్రిటిష్ అధికారుల శ్రమ, ఆస్తుల దోపిడీని అరికట్టాలని, మహిళలపై చేసే అరాచకాలను మానభంగాలనూ అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాడు. చింతపల్లి తహసీల్దార్ అయిన బాస్టియన్, అతని సహచరుడు పిళ్ళై జరిపే క్రూరచర్యలను చూసి చలించిపోయాడు. గూడేలలో నివసించే గిరిజనుల ఇళ్ళపై దాడిచేసి మేకలు, కోళ్ళు, పాలు, పెరుగు బలవంతంగా తీసుకొని పోయేవారు. స్త్రీలపట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ గొడ్డుచాకిరీ చేయించుకుని, అణా కూలీ ఇస్తామని అర్ధణాతో సరిపెట్టేవారు. అడవుల్లో లభించే కలప, చింతపండు, కుంకుళ్ళు, వంటచెరకుకు పన్ను వసూలు చేసేవారు. మన్యం ప్రజలు ఆంగ్లేయ అధికారుల పేరు చెప్తేనే గజగజ వణికిపోయేవారు.
పరిస్థితిని గమనించిన సీతారామరాజు తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యంతో వారి గాయాలకు, రోగాలకు మందులిచ్చి, వారితో కలిసి తిరుగుతూ వారిలో ఒకడిగా మారాడు. ఆ గిరిజనులను సంఘటితపరచి వారిని విలువిద్య, ఇతర యుద్ధ విద్యలలో ఆరితేరేటట్లు చేసాడు. ఆంగ్లేయ అధికారులకు బానిసలుగా ఉండవద్దని, కూలీ తగ్గిస్తే తీసుకోవద్దనీ, అటవీ సంపదనంతా ఉచితంగా వాడుకోవచ్చనీ సీతారామరాజు వారికి ధైర్యం చెప్పాడు. త్రాగుడు, వ్యభిచారం, జూదం, వెట్టిచాకిరి మొదలగు దురలవాట్లు, దురాచారాల నుంచి విముక్తి కల్పించి, వారిని వీరులుగా, యోధులుగా గొప్ప సైనికులుగా తయారుచేసి కర్రసాము, కత్తిసాము, గుర్రపు స్వారీ, బల్లేలు విసరడం, బాణాలు వేయడం నేర్పించాడు. వారితో పెద్ద సైన్యం తయారుచేసాడు. సాయుధులైన ఆంగ్ల అధికారులను దొంగచాటుగానే ఎదిరించాలని చెప్పి గెరిల్లా విద్య నేర్పించాడు.
ఆంగ్లేయుల బలం వారి ఆయుధాలే కనుక వారి ఆయుధాల ద్వారానే వారిని ఎదుర్కొనాలి. కనుక పోలీస్ స్టేషన్లపై దాడి చేసి తుపాకులు, తూటాలు కొల్లగొట్టాలి. దానికి అద్భుతమైన పథకం రచించాడు. కోయదొరలైన గంటం దొర, మల్లు దొర, వీరయ్య, అగ్గిరాజు, ఎండుపడాలు మొదలైన వారితో దళాలు ఏర్పాటు చేసి 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి అక్కడున్న 11 తుపాకులు, 5 కత్తులు, 1400 తుపాకిగుండ్లు స్వాధీనం చేసుకొని అక్కడున్న రిజిస్టర్లో వ్రాసి సంతకం చేసి తెచ్చుకొన్నాడు. 23న కృష్ణదేవిపేట, 24న రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై దాడిచేసి అక్కడి ఆయుధాలు స్వాధీనం చేసుకొని, బందీలుగా ఉన్న మన్యం ప్రజలను విడిపించాడు.
వరుస మెరుపుదాడులతో ఉక్కిరిబిక్కిరైన బ్రిటిష్ అధికారులు అల్లూరిని, అతని అనుచరులను పట్టుకోడానికి మన్యం ప్రాంతమంతా గాలించే సమయంలో రాజు సేన గెరిల్లా పద్ధతిలో వారిపై చేసిన దాడిలో ఇద్దరు అధికారులు ప్రాణాలు కోల్పోగా మిగిలిన సైనికులు చెల్లాచెదురయ్యారు. అత్యంత సాహసంగా అక్టోబర్ 15న ముందుగా సమాచారం ఇచ్చి అడ్డతీగల పోలీస్ స్టేషన్‌పై దాడి చేసారు. అయితే ముందస్తు సమాచారం వల్ల ఆయుధాలు స్టేషన్లో లేకుండా చేయడం మినహా ఆంగ్లేయులు మరేమీ చేయలేకపోయారు. అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషన్‌ను పట్టపగలే ముట్టడించి, ఆంగ్లేయ అధికారులకు బలమైన హెచ్చరిక చేసారు.
సాండర్స్ నాయకత్వంలో వచ్చిన సైన్యం రాజు దళపు బాణాలు, తుపాకుల ధాటికి విలవిలలాడి పారిపోయింది. పల్నాడు ప్రాంతంలో హనుమంతుని కిరాతకంగా హతమార్చి పుల్లరి ఉద్యమాన్ని అణగార్చిన రూథర్‌ఫర్డ్‌ను 17.4.1924న మన్యం ప్రాంతానికి స్పెషల్ ఆఫీసర్‌గా బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. తన కుట్ర కుతంత్రాలతో కుయుక్తులతో రూథర్‌ఫర్డ్ గుడారాల్లో ఉన్న స్త్రీలపై తన పోలీసులతో దాడులు చేయిస్తూ రాజు జాడ తెలుసుకోడానికి ఎన్ని దుర్మార్గాలకు దుశ్చర్యలకు పాల్పడినా రాజు సమాచారాన్ని అధికారులకు తెలిపేవారు కాదు.
రూథర్‌ఫర్డ్, గూడేలలో ఉన్న మన్యం ప్రజలకు ఆహార పదార్ధాలు అందకుండా చేసాడు. రాజు సమాచారం చెప్పకపోతే గూడేలు అన్నింటినీ తగులబెట్టించేస్తానని ప్రకటించాడు. రాజును పట్టించినవారికి పదివేల రూపాయల నగదు బహుమతిని కూడా ప్రకటించాడు. సీతారామరాజుకు అండదండగా ఉండే అగ్గిదొరను 1924 మే 6న బంధించి అండమాన్ జైలుకు పంపించారు. ప్రజలను చిత్రహింసలు పెడుతూ, మహిళలపై అత్యాచారాలు చేస్తూ ఉండడాన్ని చూసి సహించి, భరించలేని సీతారామరాజు ఆంగ్లేయులకు లొంగిపోడానికి నిర్ణయించుకున్నాడు. 1924 మే 7న తాను రూథర్‌ఫర్డ్‌ను కలుసుకోడానికి వస్తున్నట్లు సమాచారం అందించాడు. అల్లూరి సీతారామరాజు వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆంగ్ల సైనిక అధికారి మేజర్ గుడాల్ రామరాజును చింతచెట్టుకు కట్టివేసి, తుపాకితో కాల్చి చంపాడు.
భౌతికంగా అల్లూరి సీతారామరాజు చనిపోయి ఉండొచ్చు కానీ తెలుగు ప్రజలకు గుండెల్లో మాత్రం నిలిచే ఉన్నారు. అందుకే విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఊర్లో అల్లూరి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ వాళ్లకు ఆయన దేవుడితో సమానం.