………….
భారత సమాజం గర్వించదగ్గ దేశ భక్తుడు అల్లూరి సీతారామరాజు. మారు మూల అడవి లో ఒక చిన్న యువకుడు పోరాటం మొదలు పెడితే, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం వణికిపోయింది. అల్లూరి ని ఎదుర్కొనేందుకు సర్వ శక్తులు ఒడ్డింది. చివరికి కుట్ర చేసి ఆయన్ని పొట్టన పెట్టుకున్నారు.
అల్లూరి సీతారామరాజు జీవితంలో ఎన్నో మలుపులు కనిపిస్తాయి. 1897 వ సంవత్సరంలో జూలై 4వ తేదీ విజయనగరం జిల్లా,పాండ్రంగి గ్రామంలో తన తాతగారి ఇంట్లో జన్మించారు. రాజు తల్లిదండ్రులు సూర్యనారాయణమ్మ,వెంకటరామరాజు.
రామరాజుకి ఒక చెల్లి,ఒక తమ్ముడు.
తండ్రి గారు ఊరు పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు గ్రామం.
1902 లో రాజు తండ్రి కలరా వ్యాధిసోకి మరణించారు.
అప్పటికి రాజు వయస్సు 6 సం.లు.
ఆయన విద్యాభ్యాసం వివిధ పాఠశాలల్లో సాగింది. 14 సం.ల వయస్సులో తన తాతగారు ఇంటికి(పాండ్రంగి) వెళ్లిపోయారు.తరువాత కొన్ని సంవత్సరాలు తునిలో ఉన్నారు. అక్కడే రామరాజు జ్యోతిష్యం,వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం,సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నారు. చిన్నప్పటి నుండే దైవభక్తి ,నాయకత్వ లక్షణాలు, దాన గుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవ పూజ చేసేవాడు. 1916లో ఉత్తర భారత దేశయాత్రకు వెళ్లారు.ఈ యాత్ర లో బ్రహ్మ కపాలంలో సన్యాస దీక్షా స్వీకరించి యోగిగా తిరిగి వచ్చారు.ఈ యాత్రలో ఎన్నో భాషలు, విద్యలు నేర్చుకున్నారు.
ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు తన కార్యస్థలి కి తిరిగి వచ్చారు.
1918లో కృష్ణదేవిపేట (కె.డి.పేట),చిక్కలగడ్డలో ఉండేవారు. ఇక్కడ ఉన్నప్పుడు మన్యం ప్రజల కష్టాలను నివారించడానికి ప్రయత్నించేవారు.వాళ్లకి ఆయుర్వేద వైద్యము చేసేవారు. రామాయణ భారత కథలు వినిపించేవారు.
ఆ తర్వాత ఏజెన్సీ ప్రజల కష్టాలు చూసి చలించి పోయారు.
ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలు, బ్రిటిష్ వారి చేతిలో అనేక దురాగతలకు,దోపిడీలకు,అన్యాయాలకు,గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, స్త్రీల పై మానభంగాలు సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా మారింది. పోడు వ్యవసాయం చేసుకుంటూ అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకొని జీవించే వారిపై బ్రిటిష్ వారు ఘోరమైన దురాగతలు చేసేవారు.
మన్యం ప్రజల కష్టాలను కడతేర్చడానికి బ్రిటిష్ వారి దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనలకు అండగా నిలిచి పోరాటం చేయాలని సీతారామరాజు
నిర్ణయించుకున్నాడు.వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారు చేశాడు. చుట్టుప్రక్కల 30,40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యారు. మన్యంలోని గిరిజనులను సమీకరించి,వారి దురలవాట్లను దూరం చేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి,వారిని పోరాటానికి సిద్ధం చేయసాగాడు.అతని అనుచరులలో ముఖ్యులు గంటం దొర, మల్లు దొర.
1922 లో అల్లూరి సీతారామరాజు ప్రత్యక్ష కార్యాచరణ లోకి దిగారు. ఆగస్టు 22,23,24 తేదీల్లో మన్యంలో తిరుగుబాటు ప్రారంభమైంది. రంపచోడవరం ఏజెన్సీలోని చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై సుమారు 300 మంది విప్లవకారులతో దాడిచేసి, రికార్డులు చింపివేసి,తుపాకులు,మందుగుండు తీసుకువెళ్లిపోయారు.
1922 అక్టోబర్ 15న సీతారామరాజు పోరాటంలో అత్యంత సాహసోపేతమైనది అడ్డతీగల పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ముందే పోలీసులకు సమాచారం ఇచ్చి, అనుకొన్న సమయానికి వచ్చి మరీ దాడి చేశారు. తర్వాత అక్టోబర్ 19 మధ్యాహ్నం సమయంలో రంపచోడవరం పోలీస్ స్టేషన్ చుట్టుముట్టారు.
ఈ దాడులతో బ్రిటిష్ అధికారులు బెంబేలెత్తి పోయారు. రామరాజును పట్టుకోవడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీనికోసం స్పెషల్ ఆఫీసర్ గా రూథర్ ఫర్డ్ ను పంపించారు. అతనితో చర్చలు కోసం రామరాజు కేడీ పేట వైపు బయలు దేరాడు. సంధి చేసుకొందాం, చర్చలు జరుపుదాం అని పిలిపించారు. కానీ దొంగ చాటుగా ఆయన్ని బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టారు. ఆ సమయం లో కూడా సీతారామరాజు దిక్కు లు పిక్కెటిల్లా గర్జించాడు .
భారతావని స్వతంత్ర దేశమై తీరుతుంది. ఇది నిజం” అంటూ రాజు గర్జనలు దిక్కు పిక్కటిల్లాయి. రాజు గర్జిస్తూనే ఉన్నాడు. చివరికి రాజును ఎలాంటి విచారణ లేకుండా బ్రిటిష్ సైన్యం దొంగ చాటుగా కాల్చి చంపేశారు.
మొత్తం మీద సామాన్యుల పక్షాన పోరాడిన గొప్ప నాయకుడు అల్లూరి సీతారామరాజు. ఆయన పోరాటం, వ్యూహం, శైలి.. ఈ తరం యువత కు స్ఫూర్తి దాయకం.