ఈరోజు 4 జులై 2022 న భాగ్యనగరంలోని జాగృతి భవనంలో నవయుగభారతి, జాగృతి వారపత్రికల సంయుక్త ఆధ్వర్యంలో విప్లవాగ్ని అల్లూరి శ్రీ రామ రాజు 125వ జయంత్యుత్సవం జరిగింది. శ్రీచేంబోలు శ్రీ రామశాస్త్రి అధ్యక్షతవహించిన ఈ సభలో డా౹౹ అన్నదానం వేంకట సుబ్రహ్మణ్యం (కేశవస్మారక విద్యాసంస్థల కార్యదర్శి) ముఖ్య అతిథిగా, జాగృతి సంపాదకులు డా౹౹గోపరాజు నారాయణరావు ప్రధానవక్తగా పాల్గొన్నారు.
చరిత్ర అవగాహన పట్ల దృష్టినిలుపని కారణాన ఎంతగానో చరిత్ర వక్రీకరింపబడినదని, వాస్తవమైన చరిత్ర బోధింపబడటం లేదని, విద్యావంతులు ఈ అంశంపై దృష్టిసారించాలని శ్రీ చేంబోలు శ్రీ రామశాస్త్రి అన్నారు.
ప్రధానవక్త డా౹౹గోపరాజు నారాయణ రావు ఇరవైఐదు సంవత్సరాలక్రితం అల్లూరి శతజయంతి సందర్భంగా విప్లవాగ్ని అల్లూరి గ్రంథరచనకై మన్యం లోని వివిధగ్రామాలను సందర్శించి, చిటికెల భాస్కర నాయుడు, చిటికెల దాలినాయడు తదితరులనుండి సమాచారం సేకరించిన అనుభవాలను వివరించారు. కేవలం స్థానికమైన పరిమితమైన సమస్యలపై జరిగిన తిరుగుబాట్లను పితూరీ అంటారని, అల్లూరి నాయకత్వంలో జరిగినది జాతీయోద్యమమే, కాని పితూరీ కాదని , మైదానప్రాంత ఉద్యమానికి, గిరిజనుల సమస్యలపరిష్కార ఉద్యమానికీ అనుసంధానం చేయటమే అల్లూరి సాగించిన స్వాతంత్ర్యోద్యమంలోని విశిష్టత యని వివరించారు.
డా౹౹ వడ్డి విజయసారథి కరుణశ్రీగారి ఉదయశ్రీ నుండి అల్లూరి సీతారామరాజు గురించిన పద్యాలను పాడి వినిపించారు.
ప్రధానవక్త, ‘ఆకుపచ్చ సూర్యోదయం’ గ్రంథ రచయిత డా౹౹గోపరాజు నారాయణరావుగారికి చిరుసత్కారం అనంతరం వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది
ప్రముఖ పాత్రికేయులు శ్రీయుతులు జి. వల్లీశ్వర్, వేదులనరసింహం, వడ్డి ఓంప్రకాశ్ నారాయణ, కుర్రా దుర్గారెడ్డి, సంఘ ప్రచారకులు శ్రీ యుతులు గొట్టుముక్కల భాస్కర్ జీ, ఆకుతోట రామారావు గారు, సంఘప్రముఖులు డా౹౹అమరనాథరెడ్డి, ఆయుష్ జీ, బి.నరసింహమూర్తి ,భారతీయ మజ్దుర్ సంఘ్ నాయకులు కె.లక్ష్మారెడ్డి, సుంకరనరసింహం తదితరులు వక్తలను అభినందించారు