తాజ్ మహల్లో మూసి ఉన్న 22 గదులను తెరచి, వాటిలో ఏముందో చూడాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం గురువారం తోసిపుచ్చింది. బీజేపీ అయోధ్య మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ రజనీష్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
దేశప్రజలు తాజ్ మహల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అందుకు ఓ కమిటీని వేసి నిజాన్ని బయటకు తీసుకురావాలని కోరారు.
దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. రేపు మీరు వచ్చి ఈ న్యాయస్థానంలో న్యాయమూర్తుల చాంబర్స్‌లోకి వెళదామంటారా? అని నిలదీశారు. ‘‘తాజ్ మహల్‌ను షాజహాన్ నిర్మించలేదంటారా? దీని మీద తీర్పు చెప్పడానికి ఉన్నామా మేం? దయచేసి మీరు నమ్మే చారిత్రక వాస్తవాలవైపు మమ్మల్ని తీసుకెళ్లవద్దు’’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అంశాలపై తీర్పులివ్వడానిక్కాదు న్యాయ స్థానాలున్నది అనీ కోర్టు వ్యాఖ్యానించింది. ఆసలీ అంశమే కోర్టు పరిధిలోకి రాదని, చరిత్రకారులకు వదిలేయాలని తెలిపింది.