ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి ఊరట లభించింది. విద్వేషపూరిత వ్యాఖ్యలపై ఆయనపై నమోదైన కేసులో ఆయన్ని నిర్దోషిగా తేలుస్తూ కేసును కొట్టి వేసింది నాంపల్లి కోర్టు. అక్బర్ హేట్ స్పీచ్ పై విచారణ జరిపిన కోర్టు అవేం నేరపూరితంకావని స్పష్టం చేసింది. ఆ ప్రసంగాలపై దాఖలైన రెండు కేసులనూ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో కోర్టు 30 మందికిపైగా సాక్షులను విచారించింది.అదే సమయంలో అక్బర్ కు వార్నింగ్ ఇచ్చింది న్యాయస్థానం. కేసు కొట్టివేస్తున్నామంటే ఆప్రసంగాన్ని సమర్థిస్తున్నట్టు కాదని…భవిష్యత్తులో ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే చర్యలు ఉంటాయని మందలించింది. అలాంటిమాటలు దేశంలోని ప్రజల మధ్య చీలిక తెస్తాయని, దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది.
హిందువులను ఉధ్యేశించి “మీరు వంద కోట్ల మంది ఉన్నారు. మేము కేవలం 25 కోట్ల మంది మాత్రమే. అయినా సరే ఓ 15 నిమిషాలు మాకు అప్పగించండి..పోలీసులు మీరు ఆ కాసేపు పక్కకు తప్పుకోండి. మేమేంటో చూపిస్తాం ” అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడంటూ సుమోటాగానే రెండు కేసులు నమోదయ్యాయి. ఆ రెండు కేసుల్లోనూ 40 రోజులపాటు జైలుకెళ్లి వచ్చారు అక్బర్. ఇప్పుడు నిర్దోషిగా ప్రకటిస్తూ కేసుల్ని కొట్టివేసింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)