అటు ఏఐసీసీ చీఫ్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. అసలైతే జూన్ 23న పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా వేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది.
సోనియా అధ్యక్షతన ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ వీడియో కాన్ఫరెన్స్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్షఎన్నిక వాయిదా పడడం ఇది వరుసగా మూడోసారి. అయితే తదుపరి తేదీని పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ నిర్ణయిస్తుంది పార్టీ వర్గాలు తెలిపాయి.
2019 ఎన్నికల్లో పార్టీ పరాభవానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతుండగా..పార్టీ వ్యవహారమంతా రాహుల్ కనుసన్నల్లో నడుస్తోంది.
మొన్నటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీతో పాటు పలు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. వరుస చేదు అనుభవాలతో పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. పూర్తిస్థాయి అధ్యక్షుడు కావాలని పార్టీ నేతలు, కేడర్ నుంచి డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
అటు పశ్చిమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై వీడియోకాన్ఫరెన్స్ వేదిగ్గా సోనియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రిజల్ట్ తననెంతో నిరుత్సాహపరిచాయని..లోటుపాట్లపై సమగ్ర సమీక్ష జరగాలని నాయకులకు సూచించారు.