తలనుంచి కాళ్ల వరకు బుర్ఖా ధరించాల్సిందే. తాలిబన్ చీఫ్, అఘ్గనిస్తాన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా తాజా ఆదేశం ఇది. ఆఫ్ఘనిస్తాన్లోని మహిళలకు పూర్తిగా కప్పి ఉంచే బుర్ఖాను తప్పనిసరి చేస్తూ అల్టిమేటం ఇచ్చారు. అలా నిండుగా ధరించే బుర్ఖానే సంప్రదాయంగా, గౌరవంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. గత ఏడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళల హక్కులను హరిస్తూ వస్తున్నారు తాలిబన్లు.
ఇప్పటికే బాలికావిద్యను అణచివేస్తున్నారు. ఒంటరిగా మహిళలు తిరగడానికి లేదక్కడ. తాజా ఆదేశంతో అక్కడి మహిళల జీవితం మరింత అధ్వాన్నస్థితిలోకి వెళ్లనుంది.