శివసేన పార్టీపై ఆధిపత్యం కోసం ఇరువర్గాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసిన కోర్టు… ఎమ్మెల్యేల అనర్హతపై అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పీకర్ ను ఆదేశించింది. పిటిషన్ల విచారణకు విస్తృత ధర్మాసనం అవసరమని నమ్ముతున్నట్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. అయితే అప్పటిలోగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే వర్గం ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది.
అయితే శివసేనమాదేనంటోంది శివసేన వర్గం. 20మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతివ్వని వ్యక్తిని కోర్టుల సాయంతో అధికారంలో కూర్చోబెట్టే దుస్థితిలో మనం ఉన్నామా అంటూ శిండే తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు.
అటు పార్లమెంట్లోనూ శివసేన చీలక తప్పేట్లు లేదు. లోక్సభలో ఆ పార్టీకి చెందిన 19మందిలో 12 మంది ఎంపీలు ఠాక్రేపై తిరుగుబాటు చేసి ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. వారంతా షిండేతో టచ్ లో ఉన్నారు. ఠాక్రేపై తిరుగుబాటు వర్గంగా ఏర్పడిన ఎంపీలకు ‘వై’ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.