మన భారత దేశంలో ఎన్నెన్నో విశిష్ట దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. నిరంతరాయంగా పూజలు అందుకుంటున్న దేవాలయాల్లో కొన్ని చోట్ల మాత్రం దర్శనాలను క్రమబత్తీకరణ చేస్తారు. శబరిమలై అంటే క్షేత్రాల్లో ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే దర్శనాన్ని అనుమతిస్తారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే అరుదైన నాగేంద్రుడి దేవాలయంలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.
ఉత్తరాదిన పుణ్యక్షేత్రంలో ఈ దేవాలయం కనిపిస్తుంది. సంవత్సరం పొడవునా అర్చకులు మాత్రం క్రమం తప్పకుండా ఇక్కడ పూజలు చేస్తారు. కానీ బయట భక్తులను మాత్రం దర్శనానికి ఒక్కరోజు మాత్రమే అనుమతిస్తారు. ఇది ఎన్నో శతాబ్దాలుగా ఉన్న ఆనవాయితీ. పురాతననగరం అయిన ఉజ్జయినిలో ఈ ఆలయం ఉంది. సాధారణంగా ఉజ్జయినీ అనగానే మహాకాళేశ్వర లింగం గుర్తుకు వస్తుంది.
భారత దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి మహాకాళేశ్వర లింగం. ఈ దేవాలయం మూడో అంతస్తులోనే నాగ చంద్రేశ్వర దేవాలయం ఉంది. ఇక్కడ కేవలం నాగపంచమి రోజున మాత్రమే స్వామివారిని దర్శించుకునే భాగ్యం లభిస్తుంది. ఏటా శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే పంచమి రోజు ఈ ఆలయం తలుపులు తెరుస్తారు. ఈ రోజు స్వామివారికి ప్రత్యేకపూజలు చేసిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
ఏడాదిలో ఈ ఒక్కరోజు సర్పరాజు… తక్షకుడు ఇక్కడ కొలువై ఉంటారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
ఇక ఉజ్జయిని నాగచంద్రేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది..1050లో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడని ఆ తర్వాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మహరాజ్ 1732 లో ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టాడని చెబుతారు. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు తరతరాలుగా వెంటాడుతున్న సర్పదోషాలన్నీ తొలగిపోతాయంటారు. అందుకే నాగపంచమి రోజు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.
ఈ ఏడాది నాగపంచమి ఆగస్టు నెల 9వ తేదీ అంటే శుక్రవారం నాడు వచ్చింది. ఈరోజు అంతా ఉజ్జయినిలో నాగేంద్రుడి గుడిలో దర్శనాలు వెళ్ళువెత్తాయి. ఒక్కరోజే సుమారు 3 లక్షల మంది భక్తులు నాగేంద్రుడు ని దర్శించుకున్నారు.