అయోధ్య లో భవ్యమైన రామమందిరం నిర్మాణం అయినప్పటి నుంచి,, రామాలయం కీర్తి ప్రతిష్టలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాముడి గుడిని దర్శించేందుకు వస్తున్న భక్తుల సంఖ్య విస్తారంగా పెరుగుతోంది. ఈ క్రమంలో అయోధ్యలో మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా అయోధ్యను దర్శిస్తున్న యాత్రికుల వివరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బయట పెట్టింది. అయోధ్య రామమందిరం సరికొత్త రికార్డ్ సొంతం చేసుకున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బీజేపీ సర్కార్ వెల్లడించింది. దేశంలోనే మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్ మహల్ అగ్రగామిగా ఉండగా తాజాగా ఆ రికార్డ్‌ను అయోధ్య బద్దలుకొట్టింది. ఇక శతాబ్దాల తర్వాత నిర్మితమైన అయోధ్య రామమందిరాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా భారీగా పర్యాటకులు వచ్చి సందర్శించారు.
ఇందుకు సంబంధించిన లెక్కలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్యను 13.55 కోట్ల మంది భారతీయులు సందర్శించారు. వీరితోపాటు 3,153 మంది విదేశీ పర్యాటకులు కూడా అయోధ్యను సందర్శించారు. అదే సమయంలో ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్‌ను మొత్తం దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు కలిపి 12.51 కోట్ల మంది సందర్శించినట్లు తెలిపింది. కేవలం 9 నెలల్లోనే తాజ్ మహల్ రికార్డ్‌ను అయోధ్య రామ మందిరం అధిగమించినట్లు యూపీ సర్కార్ స్పష్టం చేసింది.
అలాగే ఉత్తరప్రదేశ్ లోని మిగిలిన పుణ్యక్షేత్రాల వివరాలను కూడా ప్రభుత్వం వెల్లడించింది.
మిగిలిన పుణ్యక్షేత్రాలను ఈ తొమ్మిది నెలల కాలంలో 47.61 కోట్ల మంది పర్యాటకులు సందర్శించినట్లు యూపీ టూరిజం శాఖ తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి క్షేత్రాన్ని 6.2 కోట్ల మంది భారతీయులతోపాటు 1.84 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శించినట్లు వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌ను మొత్తం 4.80 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారు. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో 6.8 కోట్ల మంది పర్యటించినట్లు చెప్పారు. 1.18 కోట్ల మంది మీర్జాపూర్‌ను సందర్శించినట్లు వెల్లడించారు.
మొత్తం మీద అయోధ్యలోని భవ్యమైన రామ మందిరం దర్శించేందుకు యాత్రికులు బాగా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా యూపీలోని ఇతర పుణ్యక్షేత్రాలకు కూడా వైభవం అంతకంతకూ పెరుగుతోంది అన్న మాట.