ప్రకృతి అందాలకు నిలయమైన గోదావరి జిల్లాలో భారీ సినిమా స్టూడియో తీసుకురావాలని తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత సినిమా రంగం హైదరాబాదు నుంచి పెద్దగా కదల్లేదు . కానీ కొంత మేరకు సినిమా నిర్మాణం అంశాలు మాత్రం విశాఖపట్నం కి తరలి వెళ్లాయి. అక్కడ కొంతమంది సినీ పెద్దలు.. ప్రభుత్వం నుంచి భూమి తీసుకుని స్టూడియోలు ఏర్పాటు చేశారు. కానీ పూర్తిస్థాయిలో ఊపు అందుకోలేదు.
కానీ ఇప్పుడు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం హయాంలో గోదావరి జిల్లాల్లో స్టూడియోలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదన ఊపు అందుకొంటోంది. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీని కూడా నవ్యాంధ్ర రాజధానికి సమాంతరంగా గోదావరి జిల్లాల్లో కూడా అభివృద్ది చేసే దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. దాదాపు 100 ఎకరాల్లో భారీ ఎత్తున స్టూడియోలు నిర్మించాలనే ప్రపోజల్ తెరపైకి వస్తోంది. ఇటీవల కొంత మంది సినిమా పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసేందుకు రెడీ అవుతున్నారు. ఆ లోపు పవన్ వద్ద పూర్తి స్థాయి గోదారి స్టూడియో ప్రతిపాదనను పెద్దలు పెట్టాలను కుంటున్నారట.
ఇందులో సినీ రంగానికి చెందిన అనేక అంశాలను తీసుకుని రావాలని భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వం వద్ద భుములు ఉచితంగా కాకుండా కొనుగోలు ద్వారానే తీసుకుని స్టూడియోలు నిర్మిస్తే బాగుంటుందని భావిస్తున్నారట. గోదావరి జిల్లాల్లో సినిమా షూటింగ్ లు జరగడం అన్నది చాలా కాలంగా కొనసాగుతుంది. ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైదరాబాద్ కి రాక ముందు నుంచే గోదావరి ప్రాంతాల్లో షూటింగ్ లు జరిగేవి. అంతేకాకుండా నటులు మాత్రమే కాకుండా దర్శకులు రచయితలు సాంకేతిక నిపుణులుగా గోదావరి జిల్లా ప్రజలు రాణిస్తున్నారు.
చాలాకాలం నుంచి గోదావరి జిల్లాలకు సినిమా రంగంతో అనుబంధం ఉంది.
ఎన్టీఆర్.. ఏఎన్నార్.. కృష్ణ జనరేషన్ సమయంలో గొదావరి జిల్లాలు షూటింగ్ కి మరింత ఫేమస్ గా మారాయి. కె.విశ్వనాథ్, వంశీ వంటి దర్శకులు క్రమం తప్పకుండా అక్కడ షూటింగులు నిర్వహించేవారు. కాలక్రమేణా షూటింగ్ ల సంఖ్య ఆయా జిల్లాల్లో మరంతగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఎక్కువ శాతం షూటింగ్ లు గోదావరి జిల్లాలోనే జరుగుతున్నాయి.
మరోవైపున వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలింలు తయారీ బాగా పెరిగింది. గోదావరి జిల్లాలోని చాలామంది యువకులు ఇటువైపు అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలో గోదావరి అందాల్ని మరింత హైలైట్ చేస్తూ అక్కడ స్టూడియోలు నిర్మిస్తే బాగుంటుందని పెద్దలు ప్లాన్ చేస్తున్నారుట. పాపికొండలు ఇప్పటికే పర్యాటక కేంద్రంగా ఉంది. దాన్ని కూడా మరింత గా వృద్దిలోకి తీసుకొస్తే ఇండస్ట్రీకి అనుకూలంగా ఉంటుందన్నది వాస్తవం. కూటమి ప్రభుత్వం కూడా సినీ పెద్దల ప్రతిపాదనలకు అనుకూ లంగా ఉంటుందని పెద్దలు విశ్వాసంతో వున్నట్లు వినికిడి.
అన్ని సానుకూలంగా జరిగితే వచ్చే దసరా నాటికి గోదావరి జిల్లాల్లో సినిమా స్టూడియో లో అభివృద్ధి కోసం అని తెలుస్తోంది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గోదావరి జిల్లా వాసులే కావడం గమనించాల్సిన విషయం.