కేరళలో ఓ బాలిక యూట్యూబ్ వీడియో చూస్తూ ఎవరి సాయం లేకుండానే తన డెలివరీ తానే చేసుకుంది. మలప్పురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. 21 ఏళ్ల తన ప్రియుడి వల్ల గర్భం దాల్చిన బాలిక తనింట్లోనే బెడ్రూంలో ఈ పని చేసింది. అయితే బాలిక గర్భం దాల్చిన విషయం బిడ్డను కనేవరకూ తల్లిదండ్రులకు తెలియదు.
ప్రసవం అయ్యాక మూడు రోజుల వరకూ తన గదిలోనే ఉందీటీనేజ్ అమ్మ. మూడోరోజు శిశువు ఏడుపును గమనించి అసలు విషయం తెలుసుకున్నారు తల్లిదండ్రులు. సొంతవైద్యం చేసుకోవడంతో ఆమెకు ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
ప్రియుడి సూచన మేరకే బాలిక తనంతతాను డెలివరీ చేసుకుందని తేలింది. యూట్యూబ్లో వీడియోలు చూస్తూ బిడ్డ బొడ్డుతాడునూ కత్తిరించిందని పోలీసులు తెలిపారు. ఆస్పత్రి అధికారులు ఈ విషయాన్ని మలప్పురం జిల్లా శిశుసంక్షేమ అధికారులకు చెప్పడంతో వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బాధితురాలిచ్చిన వివరాలతో అదే ప్రాంతానికి చెందిన ఆమె ప్రియుడిని పోక్సో, అత్యాచార చట్టం కింద అరెస్ట్ చేశారు.
బాలిక తల్లికి సరిగా చూపులేదు. తండ్రేమో నైట్ వాచ్ మన్ గా పనిచేస్తున్నాడు. అందుకే ఆమె తన గర్భాన్ని దాచగలిగిందని…మూడోరోజు బిడ్డ ఏడుపు వల్ల వాళ్లకు తెలిసిందని పోలీసులు తెలిపారు. బాలిక గర్భానికి కారణమైన యువకుడితో పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అయితే తానింక మైనరే కనుక చట్టబద్దమైన వయసు వచ్చే వరకు వేచిచూడాల్సి వచ్చింది.