కొన్ని దశాబ్దాలుగా రైతులు కృతిమ ఎరువులు, పురుగుల మందులు తీవ్రంగా వాడుతున్నారు. ప్రతి సంవత్సరం రసాయనాల వాడకం విస్తారంగా పెరుగుతోంది. వీటి ఫలితంగా బీపి, షుగర్, హార్ట్ ఎటాక్, క్యాన్సర్,చర్మ సంబంధ వ్యాధులతో సతమతం అవుతున్నారు.
ఇటువంటి సమస్యలకు విరుగుడు ప్రకృతి సేద్యం మాత్రమే. అంటే ప్రకృతి లో దొరికే ఆకులు, అలములు, వాటి నుంచి వచ్చే ఉత్పత్తులతో వ్యవసాయం అన్న మాట. ఆవు ఆధారంగా అద్భుతమైన వ్యవసాయ పద్దతులు ఉండనే ఉన్నాయి.
రసాయనాల ద్వారా వ్యవసాయం పర్యావరణానికి హాని అని తెలుసుకొని ఆవుల నవీన్ అనే ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం మవాటిని కూడా అందులో పెంచుతున్నారు. ఒక రకంగా మిశ్రమ వ్యవసాయాన్ని అద్బుతంగా అమలు చేస్తున్నారు అన్న మాట. తనకు ఉన్న మూడెకరాల పొలంలో నిమ్మతోట పెట్టుకొన్నారు. దీంతో పాటు జామ, నారింజ వంటి అంతర్ పంటలు కూడా వేశారు. రసాయనాల జోలికి పోకుండా చక్కగా ప్రకృతి పద్దతులలో సాగు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
మొదట్లో సుభాష్ పాలేకర్ పద్ధతులలో జీవామృతం, ఘన జీవామృతం కషాయాలు వాడేవారు. తరువాత ప్రస్తుతం గోపాల్ భాయ్ సుతారియ గోకృపామృతం, కంపోస్ట్ వంటి వాటిని వాడుతున్నారు. అలాగే ఆవుపాలతో చేసిన పులిసిన మజ్జిగ వాడుతూ ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం కావటంతో .. వ్యవసాయ భూమిలో వానపాములు, తేనెటీగలు, మిత్రా పురుగులు చాలా వరకు వృద్ధి చెందుతున్నాయి. అంతిమంగా చక్కటి వ్యవసాయ క్షేత్రంగా ఇది రూపు దిద్దుకొంటున్నది.
ప్రస్తుత పరిస్థితులలో ప్రకృతి వ్యవసాయం చేయడం చాలా సవాళ్లతో కూడుకున్నదని ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాల్సి వస్తే వారి కుటుంబ సభ్యుల సహకారం చాలా ముఖ్యమని నవీన్ అంటున్నారు. దీంతో పాటు సమస్యలకు ఎప్పటికప్పుడు తనదైన శైలిలో పరిష్కారాలు కనుక్కొని ముందుకు సాగాలని ఆయన చెబుతున్నారు.
సహజసిద్ధంగా పండించిన నిమ్మ కాయలు స్థానికులకు అందిస్తున్నారు. దీంతో పాటు నిమ్మకాయలతో ఆర్గానిక్ నిమ్మ పచ్చడి తయారుచేసి హైదరాబాద్ వంటి నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. అలాగే నిమ్మకాయలతో ఫ్లోర్ క్లీనర్ ని కూడా తయారు చేస్తున్నారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసి, ఆరోగ్యకరమైన పండ్లు, పండ్ల ఉత్పత్తులను అందిస్తున్నారు.