గులాబీ పార్టీ మీద టార్గెట్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పనిని వేగవంతం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం మీద అసంతృప్తిగా ఉన్న సీనియర్ నాయకులకు గేలం వేస్తున్నారు. ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించేస్తున్నారు.
తాజాగా బి ఆర్ ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావుని కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్నారు. వాస్తవానికి కేకే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో బాగా బతికిన పెద్ద నాయకుడు. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ తరఫున వార్తలు రాస్తూ ఆ పార్టీ నాయకులకు 80వ దశకంలో దగ్గర అయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి వ్యూహకర్త గా పేరు తెచ్చుకున్నారు. ఇంగ్లీషు హిందీ భాషల మీద అద్భుతంగా పట్టు ఉండటం కలిసి వచ్చింది. ఢిల్లీలోని హై కమాండ్ కు ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ అందించడం ద్వారా అక్కడి పెద్దలకు దగ్గర అయ్యారు . ఫలితంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేశారు. తెలంగాణ నాడిని పసికట్టి హై కమాండ్ కు చేర్చడంలో కీలకపాత్ర పోషించారు.
2014 సంవత్సరంలో రాష్ట్ర విభజన జరిగాక టిఆర్ఎస్ పార్టీ పేరు మార్మోగిపోయింది అదే సమయంలో కేకే కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరిపోయారు. మొదట్లో గులాబీ పార్టీలో ఆయనకు పెద్దపేట వేస్తామని హామీ ఇచ్చారు. సెక్రటరీ జనరల్ పదవిని సృష్టించి అందులో కూర్చోబెట్టారు. పార్టీలో కేసీఆర్ తర్వాత నంబర్ టూ స్థానం కేకేదే అని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇది మూన్నాళ్ళ ముచ్చటే అయింది.
2018 లో రెండోసారి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పార్టీ తీరుతెన్నులు మారిపోయాయి. పార్టీని పూర్తిగా కెసిఆర్ కుటుంబ పార్టీగా మార్చేశారు. పార్టీ మీద ప్రభుత్వం మీద కేటీఆర్ పట్టు బిగించారు దీంతో కే కేశవరావు లాంటి సీనియర్లు ఇంటికే పరిమితం అయ్యారు అవకాశం కోసం చూస్తూ కూర్చున్నారు.
2023లో అధికారం లోకి వచ్చాక .. పిసిసి అధ్యక్షుడు మరియు రేవంత్ రెడ్డి పాత కాంగ్రెస్ నాయకులకు కబుర్లు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే కేకేతో మంతనాలు జరిగాయి అయితే పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పడం జరిగింది. ఈలోగా కేకే కుమార్తె హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కామ్ గా కాంగ్రెస్ పార్టీలో కలిసి పోయారు. పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీ పూర్తిగా చతికిల పడటంతో కేకే కి క్లారిటీ వచ్చేసింది.
దీంతో ఢిల్లీ చేరుకుని కాంగ్రెస్ పెద్దల సమక్షంలో హస్తం పార్టీలో చేరిపోయారు. పార్టీ తరఫున పెద్ద పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఈ చేరిక జరిగిందని చెబుతున్నారు. దీనిని బట్టి ఆయనకు పిసిసి చీఫ్ ఇచ్చే అవకాశం ఉందన్న టాక్ కూడా అనిపిస్తోంది. కానీ మరోవైపు పార్టీని అంటిపెట్టుకొని కష్టకాలంలో పోరాటం చేసిన నాయకుల్ని పక్కన పెట్టేసి.. ఇప్పుడు పార్టీ లో చేరుతున్న కేకే లాంటి వారికి సింహాసనం అప్పగించడం తగదు అంటూ గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.