విద్యా లోకంలో విద్యార్థుల ప్రయోజనం కోసం నిరంతరంగ పనిచేస్తున్న అఖిల భారత విద్యార్థి పరిషత్తు ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. జూలై నెల 9వ తేదీన ఢిల్లీ వేదికగా ఆవిర్భవించిన ఏబీవీపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యార్థుల కోసం ఎన్నెన్నో పోరాటాలు చేసింది. ‘నేషన్ ఫస్ట్’ ఆలోచనతో విద్యార్థి పరిషత్ దేశం కోసం, దేశ సంస్కృతి పరిరక్షణ కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో రాజీలేని ఉద్యమాలు నిర్వహించింది. ఈ ఉద్యమాల నిర్వహణలో ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది. ఎబివిపి సభ్యత్వం ఇప్పటికి 54,85,514, విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా దాదాపు 50 వేల కళాశాలల్లో ప్రవేశించింది. పదివేల శాఖలు కలిగి ఉంది. ఆజాద్ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా ‘ఏక్ గాన్ ‘ఏక్ తిరంగా’ కార్యక్రమానికి పిలుపునిస్తే 1,10,450 స్థలాలలో ఒకేసారి జాతీయ జెండా ఆవిష్కరించిన ఘనత ఎబివిపికి దక్కుతుంది. భౌగోళికంగా చూస్తే కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు, గుజరాత్ నుంచి మణిపూర్ వరకు ఇలా దేశంలోని దాదాపు అన్ని జిల్లాలలో విద్యార్థి పరిషత్ విస్తరించింది. అన్ని విశ్వవిద్యాలయాలలో ఎబివిపి పని నడుస్తోంది.
అసలు విద్యార్థి పరిషత్ ప్రస్థానాన్ని పరిశీలించినట్లయితే..
ఎబివిపి 1948లో ప్రారంభమైంది. 1975 నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. విద్యా రంగానికి బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించాలని, దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, జాతీయ గీతంగా వందేమాతరం ఉండాలని, దేశం పేరు భారత్‌గా ఉండాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి పరిషత్ అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు నిర్వహించింది. 1975లో భారతదేశ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో విద్యార్థి పరిషత్ జరిపిన ఉద్యమం అద్వితీయమైనది. గుజరాత్, బీహార్లలో ఆవినీతికి వ్యతిరేకంగా హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్న ఉద్యమాలు చెప్పుకోదగ్గవి. 1983లో ‘సేవ్ అస్సాం ఉద్యమంలో ‘చలో గౌహతి’ కార్యక్రమం, 1990లో ‘సేవ్ కాశ్మీర్’ ఉద్యమంలో ‘చలో కాశ్మీర్’ కార్యక్రమం, 90 దశకంలోనే అయోధ్య శ్రీరామజన్మభూమిలో రామమందిర నిర్మాణం ఉద్యమంలో వేలమంది విద్యార్థులు పాల్గొనేలా ప్రేరణనిచ్చింది.
1980 నుండి 1997 వరకు తెలంగాణ ప్రాంతంలో రాడికల్ విద్యార్థి సంఘాలకు, నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. సరస్వతీ నిలయాలలో పెన్నులకు అవకాశం ఉండాలి తప్ప గన్నులకు కాదు అని ఎబివిపి స్పష్టంగా చెప్పింది. ఈ పోరాటంలో ఏచూరి శీనన్న నుండి మేరెడ్డి చంద్రారెడ్డి వరకు 30 మందికి పైగా కార్యకర్తలు హత్యలకు గురయ్యారు. ఇలా అనేకమంది ఎబివిపి కార్యకర్తలు సమాజ కార్యంలో పనిచేస్తూ బలిదానమయ్యారు. ఇలా అనేక పోరాటాలు, ఉద్యమాలతో విద్యార్థి పరిషత్ నిరంతరం పెరుగుతూనే ఉంది.
2000 సంవత్సరం తరువాత విద్యార్థి పరిషత్ ఎంతలా ఎదిగిందంటే ఒక విరాట్ స్వరూప దర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రారంభ కాలం నుండి గల్లీల్లో ఇచ్చిన నినాదాలు, అన్ని ప్రాంతాల్లో చేసిన పోరాటాలు నేడు దేశ చట్టసభల్లో చట్టాలై బయటికి వస్తున్నాయి. వాటి ఫలితమే 370 ఆర్టికల్ రద్దు, సిఎఎ-ఎన్ఆర్సి దేశంలో అమలు కావడం, అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం, విద్య భారతీయత ఆధారంగా రూపొందించిన ఎన్ఐపి 2020 వంటివి కొన్ని ఉదాహరణలు.
వామపక్ష భావజాలం, విభజించే సిద్ధాంతంలా కాకుండా భారతీయ తత్వంతో కూడిన కలిసి ఉండడం, కలిసి ఆలోచించడం, కలిసి పనిచేయడం వంటి మంచి గుణాలు యువతకు నేర్పింది. కాబట్టి విద్యార్థి పరిషత్ ఆలోచనలకు ఆదరణ లభించింది. కులం, ప్రాంతం, పార్టీ వంటి సంకుచిత అంశాల కోసం పనిచేసిన విద్యార్థి సంఘాలు, అలాగే దేశాన్ని విచ్చిన్నం చేయాలని చూసిన సంఘాలు నేడు గతి లేకుండా పోయాయి. అయితే మంచి వ్యక్తులతో కలిసి, సమాజంలో మార్పు తీసుకొస్తూ కలిసి పనిచేద్దాం. భారత్‌ను విశ్వగురువుగా నిలుపుదాం. ఇటువంటి మంచి ఆలోచనలకు ఎబివిపి ఎప్పుడూ వేదికగా నిలుస్తుంది.
ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ విద్యార్థి ఉద్యమ ప్రస్థానంలో సేవలు అందించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.