నిషేధిత సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ భారీ ఆఫర్ ప్రకటించింది. పదిహేడవ లోక్ సభ సెషన్ ప్రారంభదినం అయిన నవంబర్ 29న పార్లమెంట్ భవనంపై ఖలిస్థానీ జెండాను ఎగురవేసే రైతులకు లక్షా 25 వేల యూఎస్ డాలర్లు అంటే దాదాపు 75 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తుందిట.
భారత స్వాతంత్ర్యం కోసం నాడు భగత్ సింగ్ పార్లమెంట్ పై దాడి చేసినట్టు ఇప్పుడు పంజాబ్ స్వాతంత్ర్యం కోసం రైతులు ఖలిస్తాన్ జెండాలు ఎగురవేయాలని పిలుపునిస్తూ…జెనీవా నుంచిSFJ జనరల్ కౌన్సిల్ గురుపత్వంత్స సింగ్ పున్నం వీడియో రిలీజ్ చేశారు.
రైతుల నిరసనలతో పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లుతోందంటూ… కేంద్రం తాను తీసుకువచ్చిన మూడు రైతు చట్టాల్ని రద్దు చేయాలని నిర్ణయించిన మూడు రోజులకు ఈ ప్రకటన రావడం గమనార్హం. నూతన వ్యవసాయ చట్టం తీసుకువచ్చిన తరువాత పంజాబ్ లో నిరసనలు వెల్లువెత్తాయి. బిల్లులు ఆమోదం పొందినప్పటినుంచే రైతులు కేంద్రంపై ఓరకంగా యుద్ధం ప్రకటించారని చెప్పవచ్చు. రైల్ రోకోలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. ఆసమయంలోనే సిఖ్ ఫర్ జస్టిస్ కూడా తన ఎజెండాను ప్రకటించింది. ఆ నిరసనల్లోకి ఖలిస్తాన్ వేర్పాటువాద సమూహాలు చేరిపోయాయి. ఈ ఏడాది జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండాను ఎగురవేస్తే మూడున్నరలక్షల డాలర్ల రివార్డునిస్తామని ప్రకటించింది. అలాగే రిపబ్లిక్ డేకు ముందు ఇండియాగేట్ దగ్గర జెండా ఎగురవేస్తే రెండున్నరలక్షల డాలర్లనగదును ప్రకటించింది. ఇంకా దేశ వ్యతిరేక ఆందోళనలకు పలుమార్లు ఎస్ఎఫ్ జే పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చింది. రైతుల నిరసనలను ఖలిస్తానీ వేర్పాటువాదుల మద్దతుదారులు పూర్తిగా హైజాక్ చేశారని చెప్పవచ్చు.
ఖలిస్తానీ మద్దతుదారులు రైతుల నిరసనలను ఎలా హైజాక్ చేశారో స్పష్టం చేసే ఆధారాలు ఎన్నో బయటపడ్డాయి. నిరసనలో ఖలిస్తానీ మద్దతుదారులు ఉన్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి తమకు సమాచారం వచ్చిందని జనవరి 12నే కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇత 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై దాడి చేసి, త్రివర్ణ పతాకం స్థానంలో వివిధ జెండాలను ఎగురవేసిన గుంపులో కనిపించిన ఖలిస్థాన్ సానుభూతిపరుడు దీప్ సిద్ధూపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆందోళనల సందర్భంగా ఖలిస్తాన్ అనుకూల నినాదాలు లేవనెత్తారు. ఖలిస్తానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ బింద్రేవాలే బ్యానర్లు చాలాచోట్ల దర్శనమిచ్చాయి. అంటే రైతుల నిరసనల వెనక SFJ చీకటి కోణం అందరికీ తెలిసిపోయింది.
రైతుల వేషధారణలో ఉన్న కొంతమంది ఖలిస్తానీ తీవ్రవాద సానుభూతిపరులు …. ఇందిరా గాంధీ హత్యను గుర్తుచేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రస్తుత ప్రధానికి అదే గతిపడుతుందని హెచ్చరించారు.
నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ SFJ పాకిస్తాన్ నిధులతో నడుస్తోంది. ఆందోళనలు చేస్తున్న పంజాబ్, హర్యానా రైతుల ఆందోళనకు మద్దతునిస్తూ మిలియన్ డాలర్లగ్రాంట్ ను ప్రకటించింది మొదట్లోనే. ఆందోళనలో పాల్గొనే రైతులు, వ్యవసాయ రుణాలు ఎగవేసే రైతులకు మిలియన్ డాలర్లును పంపిణీ చేస్తామని ప్రకటించింది.