బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2 పాలనాకాలం 70ఏళ్లు పూర్తైన సందర్భంగా పెద్దఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. 1952లో పట్టాభిషక్తురాలై కిరీటం పెట్టుకున్న ఎలిజబెత్ సుదీర్ఘకాలం కొనసాగిన రాణిగా రికార్డ్ సృష్టించారు. గురువారం మొదలైన వేడుకలు జూన్ 5 వరకు నాలుగురోజుల పాటు రంగరంగవైభవంగా సాగనున్నాయి. ఐదు ఖండాల్లోని 54 కామన్వెల్త్ దేశాల నుంచి క్వీన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
బ్రిటిష్ సైన్యంలోని హౌస్‌హోల్డ్ డివిజన్ దాదాపు 1,200 మంది సైనికులతో ‘‘ట్రూపింగ్ ఆఫ్ ది కలర్’’ కార్యక్రమంతో కొద్దిసేపటిక్రితం ఉత్సవాలు మొదలయ్యాయి. బకింగ్‌హాం ప్యాలెస్ బాల్కనీ నుంచి క్వీన్ గౌరవ వందనం స్వీకరించారు. అయితే ఈసారి మాత్రం బాల్కనీ అపియరెన్స్ ను నియంత్రించారు. ప్రిన్స్ హారీ- మేఘన్, ప్రిన్స్ ఆండ్రూ బాల్కనీ అపియరెన్స్ ఇవ్వడం లేదు.
వేడుకల సందర్భంగా రెండోరోజు బకింగ్‌హాం ప్యాలెస్‌తోపాటు దేశవ్యాప్తంగా 2,800కుపైగా దివిటీలను వెలిగిస్తారు. చానల్ ఐలండ్స్, ది ఐల్ ఆఫ్ మ్యాన్, బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీస్, నాలుగు అత్యంత ఎత్తయిన శిఖరాలపై కూడా దీపాలు వెలుగుతాయి. ఐదు ఖండాల్లో 54 కామన్వెల్త్ కేపిటల్స్ నుంచి క్వీన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మూడోరోజు లండన్‌లోని సెయింట్ పాల్ కేథడ్రల్‌లో నేషనల్ థ్యాంక్స్‌గివింగ్ సర్వీస్ జరగనుంది. ఈ సందర్భంగా గ్రేట్ పాల్ బెల్‌ను మోగిస్తారు. 1882లో ఏర్పాటైన ఈ గంట బ్రిటన్‌లో అతి పెద్ద చర్చ్ బెల్. గుర్రపు పందేలను ఇష్టపడే క్వీన్ దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక ఫ్లాట్ రేసింగ్ ఈవెంట్ ‘ది డెర్బీ’కి క్వీన్ హాజరవుతారని భావిస్తున్నారు.బకింగ్‌హాం ప్యాలెస్‌లో జరిగే బీబీసీ ప్లాటినం పార్టీకి 5000 మంది ముఖ్యమైన ఫ్రంట్‌లైన్ మెడిక్స్ సహా సుమారు 22 వేల మంది హాజరవుతారని చెబుతున్నారు. ఇక వేడుకల్లో బిగ్ జూబిలీ లంచెస్ ఏర్పాటు చేస్తున్నారు. కామన్వెల్త్ దేశాల్లో కూడా 600కుపైగా విందు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జూన్ 5న సెంట్రల్ లండన్ లో జరిగే పబ్లిక్ పరేడ్ తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల్లో రాజవంశీకులు ప్రయాణించే గోల్డ్ స్టేట్ కోచ్ (బండి)కి ముందు హౌస్‌హోల్డ్ కావల్రీకి చెందిన మౌంటెడ్ బ్యాండ్ నడుస్తుంది. దీనిలో క్వీన్‌ను బకింగ్‌హాం ప్యాలెస్‌కు తీసుకెళ్తారు. ఆ రోజు జాతీయ గీతం, ‘గాడ్ సేవ్ ది క్వీన్’ పాటలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
ఈ నాలుగు రోజులపాటు జరిగే సంగీత వినోదకార్యక్రమాల్లో రాకర్స్ క్వీన్ ప్లస్ ఆడం లాంబెర్ట్ , మోటౌన్ లెజెండ్ డయానా రాస్, ఎల్టన్ జాన్, అలీసియా కీస్, నిలే రాడ్జెర్స్, ఇటాలియన్ టెనార్ ఆండ్రియా బోసెల్లి, తదితరులు ఆహూతులను అలరించనున్నారు.