విశ్వహిందూ పరిషత్తు ఆవిర్భవించి ఈ కృష్ణాష్టమి కి 61 సంవత్సరాలు పూర్తి అవుతున్నది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉద్యమ పంథా లో ముందుకు సాగుతున్నది. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావం, పురోగతి, లక్ష్యాలు గురించి తెలుసుకుందాం.
ప్రపంచ దేశాలలో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆగిపోవాలని మరియు హిందువులు తమ సాంస్కృతిక విచార ధారణ మరిచిపోకుండా ఆచరించాలనే తపనతో, తాము వచ్చిన పనిని పూర్తి చేసుకుని తిరిగి వెళ్లాలని పట్టుదలతో కొందరు ధార్మికులు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సరసంఘచాలకులు శ్రీగురూజీ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ ని కలుసుకునేందుకు నాగపూర్ వెళ్లారు. వారు పర్యటనలో ఉన్నారని తెలుసుకొని కర్ణాటక కి వెళ్లి అక్కడ కలుసుకున్నారు. వారి ప్రతిపాదనలను, సమస్యలను పరిష్కారాలకు వారు కోరుతున్న సహకారాన్ని సావధానంగా విన్న పూజ్యశ్రీ గురూజీ వారికి విశ్వాసాన్ని కలిగించారు. హిందూ సంఘటనకు చేయవలసిన పని గురించి కూడా తగిన మార్గదర్శనం చేశారు ఇలా ట్రినిడాడ్ నుంచి వచ్చిన బృందం విశ్వాసంతో తిరిగి వెళ్లారు
• ఆ రోజులలో తన ఉపన్యాసాలతో మేధావి లోకాన్ని సనాతన సత్యం వైపు దృష్టి సారించేటట్లుగా స్వామి చిన్మయానంద్ జీ ప్రవచనాలు ఇవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యటించేవారు. విదేశాల్లోని హిందువుల ఘోరమైన దుస్థితిని మరియు అన్య మతాలవారు చేస్తున్న దౌర్జన్యాలను సమాధానం చెప్పలేని అనైక్యతను గమనించి హిందువుల చైతన్యం కోసం ఆయన తన పత్రిక తపోవన్ ప్రసాద్ (నవంబర్, 1963)లో ఒక వ్యాసం వ్రాసారు. తర్వాత హిందూ సమాజం గురించి హిందువుల రక్షణకై పనిచేస్తున్న ‘హిందూ మహాసభ’ కూడా ప్రపంచ హిందూ సదస్సును సూచించింది.
* రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రచారకులు మరియు హిందూస్థాన్ సమాచార్ వ్యవస్థాపకులు, పాత్రికేయుడూ అయిన ముంబై హైకోర్టు న్యాయవాది దాదాసాహెబ్ ఆప్టే గా వినతికెక్కిన శివశంకర్ ఆప్టే ఈ పనికై విదేశాలకు వెళ్లేవారు. విదేశాల్లోని హిందువుల సమస్యలు, వాటి పరిష్కారాలు మొదలైన వాటిపై పూణేలోని కేసరి అనే వార్తాపత్రికలో అనేక కథనాలు వ్రాసారు.
• ఈ నేపథ్యంలో, పూజ్య శ్రీగురూజీ గోల్వాల్కర్ కూడా పూజ్య చిన్మయానంద స్వామి మరియు వివిధ సంస్థలు, మరికొంత మంది హిందూ ధర్మం కోసం తపన చెందే ప్రముఖ వ్యక్తులతో చర్చలు జరిపారు.
విశ్వహిందూ పరిషత్ ప్రారంభం:
• శ్రీగురూజీ కోరిక మేరకు, దాదాసాహెబ్ ఆప్టే జీ దేశ విదేశాలలో అనుభవం కలిగిన కార్యకర్తలతో సంప్రదించిన తర్వాత 29-30 ఆగస్టు, 1964న శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున ముంబైలోని ‘పోవై’ ప్రాంతం లోని పూజ్య చిన్మయానంద స్వామి గారి సాందీపని సాధనాలయంలో సమావేశం జరిపారు.
భారతీయ మరియు విదేశాలలో ఉంటున్న హిందువుల సమస్యలు – ప్రభుత్వ విధానం వల్ల హిందువులకు జరుగుతున్న అన్యాయాలు మొదలైన సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు చేశారు.
పూజ్యులు చిన్మయానంద స్వామిజీ అధ్యక్షతన జరిగిన ఈ ప్రథమ సమావేశంలో వివిధ సాంప్రదాయాలకు చెందిన సాధువులు, హిందూ సమాజంలోని ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వారిలో పూజ్యులు రాష్ట్రసంత్ తుకుడోజీ మహరాజ్, పూజ్య మాస్టర్ తారాసింగ్ జీ (సిక్కు), జైనగురు పూజ్యులు సుశీల్ మునీ జీ , సోమనాథ్ దేవాలయ నిర్మాణానికి సూత్రధారి శ్రీకన్హయ్యలాల్ మాణిక్‌లాల్ మున్షీ జీ ( నెహ్రూ కాలంలో కేంద్ర క్యాబినెట్ మంత్రి) పరమ పూజనీయశ్రీ గోల్వాల్కర్ గురూజీ మరియు 40-45 మంది ఇతర పూజ్య స్వామీజీలు, ప్రముఖులు హాజరయ్యారు.
ఆ సమావేశంలో క్రింది ప్రధాన లక్ష్యాలు (1) హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం మరియు జాగృతం చేయడం (2) హిందూ సమాజం యొక్క విలువలు, జీవన మూల్యాలు, హిందూ ‘మాన బిందువులను’ రక్షించడం మరియు ప్రోత్సహించడం (3) విదేశాలలో ఉన్న హిందువులతో సంబంధాలు పెంచుకోవడం మరియు వారికి ధార్మిక ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడానికి తగిన సహాయం అందించడం,
సమ్మేళనాలు – ఉద్యమాలు.
* ఈ సమావేశ నిర్ణయం ప్రకారం, 1966 జనవరి 22, 23, 24 తేదీలలో కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్ లో మొదటి ప్రపంచ హిందూ సమ్మేళనం జరిగింది, ఇందులో 12 దేశాల నుండి 25 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు, మూడు వందల మంది ప్రముఖ సాధువులు పాల్గొన్నారు. తొలిసారిగా నలుగురు శంకరాచార్యులందరూ ఒకే వేదికపైకి వచ్చారు.
* విశ్వహిందూ పరిషత్ కమిటీని ప్రకటించారు. మైసూర్ మహారాజ శ్రీజయచామ చంద్ర వడయార్ అధ్యక్షుడయ్యారు. అప్పటికే వారు మద్రాసు ప్రావిన్స్ కు గవర్నర్ గా ఉండేవారు, మరియు శ్రీదాదాసాహెబ్ ఆప్టే ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఈ సమావేశంలోనే,,,, అనేక కారణాల వలన హిందుత్వాన్ని వదిలి అన్య విదేశీ మతాలలోకి వెళ్ళినవారు తిరిగి తమ పూర్వ ధర్మంలోకి రావచ్చునని చారిత్రాత్మక నిర్ణయించడం జరిగింది.
* విశ్వహిందూ పరిషత్ యొక్క నినాదం “ధర్మో రక్షతి రక్షితః ” గా నిర్ణయించబడింది మరియు “వటవృక్షం” అధికార చిహ్నంగా నిర్ణయించబడింది.
* ఈ ప్రపంచ సదస్సు తర్వాత ఆనాటి వివిధ ప్రావిన్సులలో హిందూ సమ్మేళనాలు జరిగాయి. ఉడిపి (కర్ణాటక). పంఢరిపూర్ (మహారాష్ట్ర), జోర్హాట్ (అస్సాం), సిద్ధాపూర్ (గుజరాత్) మొదలైనవి.
• ఈ సమ్మేళనాలలో వివిధ తీర్మానాలు ఆమోదించబడినాయి.
|| హైందవ సోదరా సర్వే, న హిందూ పతితో భవేత్ మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్రం సమానత||
(హిందువులందరూ సోదరులు, ఏ హిందువు కూడా పతితుడు కాడు, మన యొక్క దీక్ష హిందూ సమాజం యొక్క రక్షణ, మన యొక్క మంత్రం మనమందరం సమానం.) అనే మంత్రాన్ని సాధువులు నిర్ణయించారు. సమాజానికి ఉపదేశించారు.
* రెండవ ప్రపంచ హిందూ సమ్మేళనం 1979 జనవరి 27, 28, 29 తేదీలలో ప్రయాగరాజ్ లో జరిగింది, ఇందులో 18 దేశాల నుండి 60 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
* ఈ సదస్సును బౌద్ధ గురువు పూజ్యులు దలైలామా ప్రారంభించారు. ఆయనకు పూజ్య జ్యోతిష్పీఠం శంకరాచార్య స్వాగతం పలికారు. ఇదొక చారిత్రక సంఘటన.
* 1980 నుండి మోరోపంత్ జీ పింగళే గారు పరిషత్‌కు మార్గదర్శకులుగా, 1982లో, శ్రీ అశోక్ జీ సింఘాల్ గారు పరిషత్ కేంద్ర సమితిలో సభ్యులయ్యారు అప్పటినుండి విస్తృతంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
* 1982లో జన్-జాగరణ్ అభియాన్ (సంస్కృతి రక్షా యోజన) మరియు 1983లో ఏకాత్మతా యాత్ర (గంగామాత, భారతమాత యాత్ర) వంటి పెద్ద పెద్ద ప్రభావవంతమైన కార్యక్రమాలు జరిగాయి. లక్షల గ్రామాలను కలిపిన ఈ ‘ఏకాత్మత యాత్ర” లో 6 కోట్ల మంది పాల్గొన్నారు.
* మొదటి “ధర్మ సంసద్” ( హిందూ పార్లమెంట్ ) న్యూఢిల్లీలో ఏప్రిల్, 1984లో జరిగింది. గత 60 సంవత్సరాలలో అనేక సమావేశాలు జరిగాయి, ఇందులో హిందూధర్మం లోని సుమారు 125 శాఖలకు చెందిన 12 వేల మంది సాధువులు మరియు ఋషి, మునులు పాల్గొన్నారు.
* విశ్వహిందూ పరిషత్ తొలి సమావేశం 1964 లోనే అడవుల్లో కొండ కోనల్లో ఉన్న మన సోదరులైన పేదవారిని అక్కున చేర్చుకోవడం, షెడ్యూల్డ్ కులాల కాలనీల్లో పేదల బస్తీల్లో సేవాకార్యక్రమాలు ప్రారంభించాలని చర్చ జరిగింది. అందుకు తగ్గట్టుగానే సేవాకార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నేడు మొత్తం 7 వేల సేవా కార్యక్రమాలు ఉండగా అందులో 112 హాస్టళ్లు, 44 అనాథ శరణాలయాలు, 850 వైద్య కేంద్రాలు స్వావలంబన కేంద్రాలవంటివి ఉన్నాయి.
* దేశంలోని ఆలయాల అనుసంధానం, అర్చకులకు శిక్షణ, వేదపాఠశాల, సామాజిక సామరస్యం మొదలైన వివిధ పనులు క్రమంగా ప్రారంభమై వేగంగా ‘పరిణామం వైపు’ కొనసాగుతున్నాయి .
* సంస్కారం : దేశంలోని మూడు వేల పాఠశాలల్లో లక్షలాదిమంది విద్యార్థులు రామాయణం పరీక్షలు, వందలాది స్థలాల్లో భగవద్గీత పోటీల్లో లక్షలాదిమంది విద్యార్థులు పాల్గొంటున్నారు. షోడశ సంస్కారాలు అందించడానికి ఒక తమిళనాడులోనే 5000 మంది పురోహితులకు, పూజారులకు ప్రశిక్షణను ఇవ్వడం జరిగింది. 31 ప్రాంతాలలో సుమారు 100 సంస్కారశాలలు ప్రారంభమయ్యాయి 17వేలకు పైగా విద్యార్థులు పాల్గొంటున్నారు.
పరిషత్ చేసిన పనులు:
• సంస్థాగత కార్యక్రమాలతో పాటు పరిషత్ యొక్క రెండవ పని సమాజంలో చైతన్యం మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని, వివిధ రక్షణ పనులకై బజరంగదళ్, దుర్గావాహిని వంటి సంస్థలు ప్రారంభించబడ్డాయి.
* గోసంరక్షణ మరియు గోసేవ పనులు, ఈ ఏడాది లోనే 1,90,000 కు పైన ఆవులు కాపాడగా, ఇప్పటివరకు కోటికి పైగా ఆవులను కసాయిల నుండి విముక్తి చేయడమైనది, 600 కంటే ఎక్కువ గౌశాలలతో అనుసంధానం. 175 పంచగవ్య మందుల తయారీ కేంద్రాలు నడుస్తున్నాయి.
* మనదేశంలో మతం మార్పిడి సమస్య చాలా పెద్దది. విశ్వహిందూ పరిషత్ కృషి వలన 40 లక్షల మందికి పైగా మతం మార్పిడి నుండి రక్షింపబడ్డారు, మరియు మతం మార్చబడిన వారు ఇప్పటి వరకు 10 లక్షల మందికి పైగా తమ పూర్వ ధర్మంలోకి తిరిగి వచ్చారు.
* శ్రీరామజన్మభూమి ఉద్యమం 1984లో ప్రారంభమైంది. శ్రీ రామజానకీ రథయాత్ర, శ్రీరామ శిలాపూజన్, శ్రీరామపాదుకా పూజ, మొదటి కరసేవ (1990) మరియు ఢిల్లీ బోట్ క్లబ్ (ఏప్రిల్ 4, 1991) చారిత్రక ర్యాలీ వంటి భారీ సంఖ్యతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరిగాయి. ఈ చైతన్యం ఫలితంగా, 6 డిసెంబర్ 1992న కరసేవ,. తదనంతరం కోర్టులు పూనుకొని హిందూ సమాజానికి న్యాయం చేయడం, శ్రీరామమందిరం నిర్మాణం జనవరి 22వ తేదీన ఆలయ ప్రారంభ కార్యక్రమానికి ఐదు లక్షల 25వేల గ్రామాల నుండి 17 కోట్ల కుటుంబాలను కలిసి ఆహ్వానించడం తెలిసిందే.
* ఈ చైతన్య కార్యక్రమాల వలన ప్రపంచానికి మేలు చేసే వారము మేము – గర్వుసే కహో హమ్ హిందూ హై – (‘మేము హిందువులమని గర్వంగా చెప్పండి) అనే ఈ నినాదం ప్రపంచమంతటా ప్రతిధ్వనించింది.
* 2007లో రామసేతు రక్షా ఆందోళన్ ప్రారంభమైంది. చక్కాజాం, ఢిల్లీలో భారీ ర్యాలీ జరిగింది… ఇది ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద ఆందోళనాత్మక కార్యక్రమం.
ధార్మిక యాత్రలు:
1996వ సంవత్సరం లో అమర్నాథ్ యాత్రికులను హత్య చేసి యాత్రను రద్దు చేసిన పరిస్థితిలో జమ్మూ కాశ్మీర్‌లోని జే. కే. ఎల్. ఎఫ్. తీవ్రవాదుల సవాలను స్వీకరించి 51,000 వేల బజరంగ్దళ్ కార్యకర్తలు ముందు సాగగా మరో లక్షకు పైగా భక్తులు బయలుదేరి అమర్నాథ్ యాత్రను పునః ప్రారంభించడం, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న మూడవ అమర్నాథ్ యాత్రను ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ద్వారా ఆ ప్రాంతాల్లో ఉన్న హిందువులకు విశ్వాసాన్ని కలిగించడం జరుగుతున్నది. హర్యానాలో మేవాత్ యాత్ర, కర్ణాటకలో దత్తపీఠ యాత్ర, అయోధ్య నుండి జనక్‌పూర్ వరకు శ్రీరామ జానకి వివాహ బారాత్ యాత్ర భారత నేపాల్ దేశాల మధ్య ధార్మిక సంబంధాలను పునరుద్ధరణ,
సంస్థాగతం:
• నేడు దేశం మొత్తం 1132 కి గాను 1052 జిల్లాల్లో, 9938 తాలూకాలకు గాను 7500 తాలూకాల్లోనూ 50 వేల గ్రామ కమిటీలు కలుపుకొని మొత్తం 80 వేలకు పైగా కమిటీలు ఉన్నాయి…. ఇవికాక 28 వేల సత్సంగ సమితులు, 40 వేల బజరంగదళ్, 5 వేల దుర్గావాహిని యూనిట్లు, ఉండగా, గోరక్ష, సామాజిక సమరసత మంచ్, సంస్కృతం వంటివే మరో 20 విభాగాలలో వేలాది యూనిట్లు పనిచేస్తుండగా. 550 మంది జీవితకాలం పనిచేసే వారు, మరో వెయ్యి మంది నిశ్చిత సమయాన్నిచ్చే కార్యకర్తలు, 65 లక్షల మంది సభ్యులు పని చేస్తున్నారు. ప్రతి సంవత్సరం పదివేలకు తగ్గకుండా కార్యకర్తలకు కఠిన పరిస్థితుల్లో సైతం దేశ రక్షణకు ధర్మరక్షణకై పనిచేయగలిగే విధంగా ప్రశిక్షణనూ ఇవ్వడం జరుగుతున్నది.
విదేశాల్లో:
• 80 విదేశాలలో వివిధ కార్యక్రమాలు జరుపుతుండగా, 30 దేశాల్లో పరిషత్ కమిటీలున్నాయి. బాలసంస్కార కేంద్రాలు, నెలవారీ సత్సంగం, మహాత్ములు, సాధువుల ప్రవచనాలు, సదస్సులు మరియు అన్యాయానికి వ్యతిరేకంగా చైతన్య కార్యక్రమాలవంటి అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
• హిందూ సమాజాన్ని విన్నాడుతున్న ధార్మిక సమస్యలు: ఇన్నిన్ని రంగాలలో అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ హిందూ సమాజం ఎదుట అనేకమైన ధార్మిక, సామాజిక, రాజకీయపరమైన సమస్యలు అనేకం ఉన్నాయి.
– మతం మార్పిడిలు: హిందువులలోని అనేక మంది పేదరికాన్ని, చదువు లేని తనాన్ని, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మతం మారుస్తున్నారు.
– సంస్కార విహీనత:
వందల సంవత్సరాలు విదేశీ మతాల వారి వద్ద బానిసత్వం కారణంగా, పశ్చిమ దేశాల జీవన ప్రభావం కారణంగా నేటి తరంలో పరంపరాగతమైన భారతీయ హిందూ సంస్కార విహీనత కనబడుతున్నది. యువతకు సంస్కారం మరియు ఆధ్యాత్మిక శిక్షణ అవసరం.
– హిందూ సమాజంలో సామాజిక సమస్యలు : కులభేదాలు, ప్రాంతీయ భేదాలు, ఆర్థిక అసమానతల కారణంగా నిర్మాణమైన సామాజిక సమస్యలు అనేకం, కుటుంబ జీవనం విచ్ఛిన్నం కావడం, యువతీ యువకులలో వివాహం ఆలస్యం కావడం, తక్కువ మంది పిల్లలను కనడం, కొందరు తమకు పిల్లలే వద్దు అనుకోవడం హిందూ సమాజానికి శాపంగా మారుతున్నది. విదేశీ కుట్రదారులు కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం తయారుచేసిన అనేక కట్టు కథలు (‘నెరేటీవ్స్’) నమ్మి వివాదాలకు పాల్పడడం హిందూ సమాజానికి ప్రమాద సంకేతం
– ధార్మిక స్థలాల సంరక్షణ:
హిందూ సమాజ ఆధ్యాత్మిక ధార్మిక కేంద్రాలను విదేశీ మతాలవారు కబ్జాలు చేసి విడవకుండా ఉండడం, మరోవైపు ప్రభుత్వమే అనవసర జోక్యం చేసుకొని వేలాది ఆలయాలను, మఠాలను, భూములను తమ చేతుల్లో పెట్టుకోవడం, ఇప్పటికీ ఆలయాలపై దాడులు కొనసాగుతూ ఉండడం హైందవ సమాజానికి చింతాజనకంగా మారింది .
– జనసంఖ్య అసంతులనం: హిందూ కుటుంబాలలో సంఖ్య తగ్గడం, మరోవైపు దేశంలోకి బంగ్లాదేశ్ పాకిస్తాన్ రోహింగ్యా చొరబాటుదారులు కోట్లాదిమందిగా రావడం హిందూ సమాజం యొక్క సమస్యకు సంకేతం.
– బంగ్లాదేశ్ పాకిస్తాన్ లలో గల హిందువులపై దాడులు ఆలయాల విధ్వంసం, మతం మార్పిడులు.
* వీటన్నింటికీ పరిష్కారం: శత్రువులు చెప్పే మాటలు మాత్రమే ప్రచారం జరుగుతున్న ప్రస్తుత సమయంలో, హిందూధర్మం హిందూ సమాజ రక్షణకు నేటితరం పూనుకునేట్లుగా తగిన శిక్షణ మరియు జాగరణ అత్యవసరం. దీనికై పాఠశాలల్లో కళాశాలలు ప్రజలు కలిసే సామూహిక స్థలాల్లో ప్రత్యేకశిక్షణ ఇవ్వడం జరగాలి. అవసరమైన చోట పూజ్య స్వామీజీలు, అనుభవం కలిగిన వ్యక్తులు సమయం ఇచ్చి పర్యటన చేయాలి.
– సమాజంలోని కుల భేదాలను రూపుమాపడం కోసం సామాజిక సమరసతా ఉద్యమం వేగంగా జరగాలి. సామాజిక న్యాయం మరియు సమరసతల సైధ్ధాంతిక ప్రభావం పెరగడానికి కార్యక్రమాలు రూపొందించాలి.
– ధార్మిక స్థలాల రక్షణ కోసం న్యాయపరమైన పోరాటాలతో పాటు ఆందోళన చేయడానికి రోడ్డుపైకి వచ్చే విధంగా సమాజాన్ని సంసిద్ధం చేయడం జరగాలి. మన ధార్మిక మూలాల పట్ల జాగరూకత పెంచాలి. యువతరాన్ని సన్నద్ధం చేయాలి.