టిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయించాలని పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పనిని వేగవంతం చేస్తున్నారు. గులాబీ నాయకులను దొరికిన వాళ్ళని దొరికినట్లుగా కాంగ్రెస్ పార్టీలో చేర్చేసుకుంటున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు దఫదఫాలుగా హస్తం పార్టీలో చేరిపోయారు ఇప్పుడు శాసనమండలి మీద రేవంత్ టీం దృష్టి పెట్టింది.
నిజానికి శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవలసిన అవసరం ఉంది. ముఖ్యమైన బిల్లులను నెగ్గించుకునేందుకు అక్కడ ఆధిపత్యం చాలా అవసరం. శాసనమండలి సభ్యుల కోసం దీనిని దృష్టిలో పెట్టుకొని విస్తారంగా వెతుకుతున్నారు. ఆయా ఎమ్మెల్సీలకు సన్నిహితంగా ఉండే వారిని అప్రోచ్ అయ్యి ఒప్పించే పనిని చేపడుతున్నారు. తాజాగా ఆపరేషన్ ఆకర్షకి ఆరుగురు ఎమ్మెల్సీలు దగ్గర అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య ఉన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో వారు గురువారం అర్థరాత్రి కాంగ్రెస్ పార్టీతీర్థం పుచ్చుకున్నారు. గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి ఆలస్యంగా హైదరాబాద్ చేరుకోగానే ఆ ఆరుగురు ఎమ్మెల్సీలు ఆయనతో భేటీ అయ్యారు. దీపాదాస్ మున్షీ సమక్షంలో సీఎం వారికి కాంగ్రెస్ కండువా కప్పారు.
లెక్క సరిపోయాకని చేరికల కార్యక్రమం చేపట్టారు.
శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40. ప్రస్తుతం 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆరుగురు మాత్రమే సభ్యులు న్నారు. తాజాగా ఆరుగురు సభ్యులు చేరడంతో వారి బలం 12కు చేరింది. వామపక్ష ఎమ్మెల్సీ మద్దతుతో కలిపితే 13కు చేరుతుంది. కాంగ్రెస్ పార్టీకి మరో ఐదారు సీట్లు ఉంటే మండలిలో కూడా మెజారిటీ దక్కుతుంది. ప్రస్తుతం తెలంగాణ మండలిలో బీజేపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు.
అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఎమ్మెల్సీల పార్టీ మార్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కొద్ది రోజులుగా బస్వరాజు సారయ్య పేరు వినిపిస్తున్నా స్పష్టత రాలేదు. అనూహ్యంగా ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారడం కలకలం రేపింది.
గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని హోటల్లో సమావేశ మైన ఎమ్మెల్సీలు రాత్రి సమయంలో జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి చేరు కున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇంటికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. ఆ సమయంలో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన నిమిషాల్లోనే పార్టీలో చేరికల కార్యక్రమం పూర్తి చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి పాలయ్యాక పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడారు. కానీ ఎంఎల్సీలు పార్టీని విడవటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
శాసనమండలిలో కూడా బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చక చక పావులు కదుపుతోంది. దీని ద్వారా రాగల కాలంలో ప్రభుత్వానికి నడక సునాయాసం అవుతుంది. మరోవైపు, కాంగ్రెస్ హై కమాండ్ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలం బాగా పెరుగుతుంది.