ఆంధ్రప్రదేశ్ లో అక్షరాలా 500 గ్రామాలు మాయం అయిపోయినట్లు లెక్క తేలింది. అది కూడా ఏపీ హైకోర్టు దీని మీద ప్రశ్నించాక, తాపీగా అధికారులు నాలిక కరుచుకొన్నారు. ఇప్పుడు దారి తప్పిన గ్రామాల గురించి వెదకు కొంటున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని గ్రామాలను రెవిన్యూ రికార్డుల్లో గల్లంతు చేస్తున్నారు. దీని మీద హైకో్ర్టు సీరియస్ అయింది.
రెవిన్యూ యంత్రాంగం మాయాజాలం మీద ఏపీ హైకోర్టు ప్రశ్నలు గుప్పించింది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గతంలో 792 గ్రామాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 292కి తగ్గిందని, మిగిలిన గ్రామాలు ఎలా మాయమయ్యాయని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. విఫలమైతే తదుపరి విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమముందు హాజరుకావాలని స్పష్టం చేసింది.
విజయనగరం జిల్లాలోని జియ్యమ్మవలస, కురుపాం, పార్వతీపురం తదితర మండలాల పరిధిలో ఈ సమస్య తలెత్తింది. ఇక్కడ వివిధ గ్రామాల షెడ్యూల్డ్ ఏరియా హద్దులను గిరిజనేతరులకు ప్రయోజనం కలిగేలా మారుస్తున్నారని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు వెంకటశివరాం 2023లో హైకోర్టులో పిల్ వేశారు. షెడ్యూల్డ్ ఏరియా హద్దులను వెబ్‌ల్యాండ్‌లో పొందుపరిచి గిరిజన హక్కులను రక్షించాలని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది శ్యాంసుందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ గిరిజనేతరులకు లబ్ధి చేకూరేలా అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అందిన సమాచారం మేరకు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గతంలో 792 గ్రామాలున్నాయని, ప్రస్తుతం ఆ సంఖ్య 292కి చేరిందన్నారు. దీనిపై విస్మయం వ్యక్తం చేసిన ధర్మాసనం ఈ వ్యవహారంపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పొన్నారావును ప్రశ్నించింది. ఆయన స్పందిస్తూ గిరిజన గ్రామాల పూర్తి వివరాలు కావాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. ఆ వివరాలు అందగానే కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు
తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఇప్పుడు హైకోర్టు ప్రశ్నలకు సమాధానం వెదక్కొనేందుకు, మాయం అయిన గ్రామాలను తిరిగి తెచ్చేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు.