దేశమంతా ఉత్కంఠగా చూసిన ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. మూడురాష్ట్రాల్లో అధికార పార్టీనే తిరిగి ఆదరించారు ప్రజలు. అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు మూడింట రెండువంతుల స్థానాల్ని మమతా పార్టీ కైవసం చేసుకుంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కన్నా ఎక్కువ స్థానాలే సాధించి హ్యాట్రిక్ గెలుపు నమోదు చేసింది. అయితే పార్టీ ఒంటిచేత్తో గెలుపుతీరానికి చేర్చిన మమత మాత్రం నందిగ్రామ్ లో ఓడిపోయారు. మొన్నటివరకు తనకుడిభుజంగా ఉన్న సువేందు అధికారి చేతిలో ఆమె ఓటమి చవి చూశారు. పశ్చిమబెంగాల్లో గణనీయంగా ముస్లిం ఓటు బ్యాంక్ ఏమాత్రం చీలకుండా గంపగుత్తగా టీఎంసీకే పడ్డాయని చెప్పవచ్చు.
గత ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలకు పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా 77 స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటింది. అయితే ఆసారి పశ్చిమబెంగాల్ తమదేనన్న ధీమాతో బీజేపీ పనిచేస్తూవెళ్లింది..రెండేళ్ల కిందటి లోక్ సభ ఎన్నకల్లో 42 స్థానాలకు గానూ 18 సీట్లలో కమలం పార్టీ గెలిచింది. ఇక రెండున్నర దశాబ్దాలు ఈ నేలను అప్రతిహతంగా ఏలిన కమ్యూనిస్టు పార్టీ ఈసారీ బోణీ తెరవలేదు. ఇక గత ఎన్నికల్లో 44 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ కూడా నామరూపాల్లేకుండా పోయింది.
ఇక తమిళనాట మాత్రం ప్రజలు అధికార మార్పు కోరుకున్నారు. అసలైతే అక్కడ ఐదేళ్లకోసారి పార్టీలు మార్చే ఆనవాయితీ కానీ ఆ రికార్డును బద్దలు చేస్తూ 2016లో జయలలిత రెండోసారీ అధికారం చేపట్టారు. ఈ సారి మాత్రం స్టాలిన్ నేతృత్వంలో డీఎంకేకు ప్రజలు పట్టం కట్టారు. కరుణానిధి, జయలలిత లేకుండా జరిగిన ఎన్నికలను ఇరుపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అన్నాడీఎంకే, బీజేపీలు ఈసారి కూటమిగా వెళ్లాయి. 234 స్థానాలు ఉండగా.. డీఎంకే కూటమి 157 సీట్లలో ఘన విజయం సాధించింది. అన్నాడీఎంకే కూటమి 77 స్థానాలకే పరిమితమైంది.మొదటిసారి తమిళనాడు ఖాతా తెరిచిన బీజేపీ ఐదుస్థానాల్లో విజయం సాధించడం విశేషం. ఇక కొత్త మక్కల్ నీది మయ్యంతో నేనున్నానంటూ వచ్చిన నటుడు కమల్ హాసన్ పార్టీ ఉనికి చాటుకోలేకపోయాడు. స్వయంగా దక్షిణ కోయంబత్తూరు నియోజకవర్గంనుంచి ఓటమిపాలయ్యారు.
ఇక సంప్రదాయానికి భిన్నంగా ఎల్డీఎఫ్ ను మళ్లీ ఆదరించారు కేరళప్రజలు. విజయన్ పై అభిమానాన్ని చాటుతూ అధికారం కట్టబెట్టారు. 140 స్థానాలు ఉండగా.. ఎల్డీఎఫ్ 99 స్థానాలను సాధించింది. యూడీఎఫ్ గతంలో సాధించిన 41 సీట్లును నిలబెట్టుకుందంతే. గత ఎన్నికల్లో ఓ సీట్లో గెలిచి ఖాతా తెరిచిన బీజేపీ ఈసారి ఆ ఒక్కస్థానాన్ని కోల్పోయింది.
ఇక ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రం అసోంను ఎన్డీఏ తిరిగి వశం చేసుకుంది. గత ఎన్నికల్లో సాధించిన 59 సీట్లనే బీజేపీ ఇప్పుడు కూడా దక్కించుకుంది. అసోం గణపరిషత్ పదిస్థానాల్లో గెలవగా…కాంగ్రెస్ 32 సీట్లను హస్తగతం చేసుకుంది.
అటు పుదుచ్చేరిలో గెలుపు ద్వారా మరో రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంది బీజేపీ. అక్కడ ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించగా…..యూపీఏ ఎనిమిది సీట్లకే పరిమితమైంది.