పాత్రాచల్ భూ కుంభకోణం కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది ముంబైలోని స్పెషల్ కోర్టు. ఈడీ కస్టడీ గడువు సోమవారంతో ముగుస్తుండటంతో ఆయనను అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్బంగా తనకు ఇంటి నుంచే ఆహారం, ఔషధాలు తీసుకురావాలని సంజయ్ రౌత్ కోరగా.. అందుకు అంగీకరించింది కోర్టు. కానీ ప్రత్యేక పడక ఏర్పాటును తిరస్కరించింది. పాత్రాచల్ డెవలప్మెంట్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయనే అభియోగంపై సంజయ్ రౌత్ ను ఆగస్టు 1న ఈడీ అరెస్టు చేసింది. తొలుత ఈనెల 4 వరకూ ఈడీ కస్టడీకి ఆదేశించిన కోర్టు.. ఆ తర్వాత ఈడీ విజ్ఞప్తి మేరకు 8వ తేదీ వరకూ పొడిగించింది. ఈడీ కస్టడీ పూర్తవడంతో స్పెషల్ పీఎంఎల్ఏ జడ్జీ ఎంజీ దేశ్పాండే ముందు హాజరుపరిచింది. అయితే.. తమ కస్టడీని పొడిగించాలని ఈడీ కొరలేదు. దీంతో జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని ఆదేశించింది కోర్టు. ఈ కేసుకు సంబంధించి తన సతీమణి వర్షా రౌత్ ను శనివారం తొమ్మిది గంటల సేపు ఈడీ ప్రశ్నించింది.