అనుకున్నదే జరిగింది. జ్ఞానవాపి మసీదు ఒకప్పటి హిందూ ఆలయమేనని తేలింది. ఆవరణలోని ఓ బావిలో అతిపెద్ద శివలింగం బయటపడింది. హిందూదేవుళ్ల ఆనవాళ్లున్నాయంటూ ఆక్కడ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. మూడు రోజుల వీడియోగ్రఫీ సర్వే నేటితో ముగిసింది. అయితే మసీదు ఆవరణలో ఓ పెద్ద శివలింగం బయటపడింది. మసీదు లోపలి బావిలో శివలింగాన్ని కనుగొన్నట్టు న్యాయవాది విష్ణుజైన్ తెలిపారు. ఆ శివలింగం 12 అడుగుల ఎత్తు 8 ఇంచుల వ్యాసంతో ఉంది. ఉదయం కోర్టు నియమించిన సర్వే కమిటీ మసీదును చేరిన వెనువెంటనే పెద్దఎత్తున పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఈ కమిటీ మసీదు, ఆవరణలోని ప్రతీ ఇంచునూ రికార్డు చేశారు.
అటు అక్కడ శివలింగం ఉన్నట్టు సమాచారం వచ్చిన గంటల వ్యవధిలో ఓ సివిల్ కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ఏరియాలోకి ఎవరినీ వెళ్లనివ్వకుండా సీల్ చేయాలని ఆదేశించింది.
సర్వే ముగిసిందని ప్రభుత్వం తరపు న్యాయవాది మహేంద్రప్రసాద్ పాండే తెలిపారు. మూడు డోమ్ లు, అండర్ గ్రౌండ్ బేస్మెంట్, కొలను సహా అన్నింటినీ షూట్ చేసినట్టు తెలిపారు. ఇక ముగ్గురు కమిషనర్లతో కూడిన బృందం ఆ వీడియోను పరిశీలించనుంది.
కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్నదానిని జ్ఞానవాపి-శృంగార్ గౌరీదేవి కాంప్లెక్స్ గా పిలుస్తారు. ఇందులోనే మసీదు కూడా ఉంది. దానికి పశ్చిమాన హిందూ ఆలయాన్ని ధ్వసం చేసిన ఆనవాళ్లు కనిపిస్తాయి. అయితే అక్కడ రోజువారీ పూజలకు అనుమతించాలని, ఇంకా మసీదు ప్రాంగణంలో ఆలయ ఆనవాళ్లను తేల్చాలని , ఏడాదిపొడవునా పూజ చేసుకునే అనుమతివ్వాలని కోరుతూ కొందరు మహిళలు కోర్టుకు వెళ్లారు. ఢిల్లీకి చెందిన మహిళలు రాఖీ సింగ్, లక్ష్మీదేవి, సీతా సాహు సహా మరో ఇద్దరు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను స్వీకరించిన జిల్లా కోర్టు వాస్తవాలను అంచనా వేయాలంటూ అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించారు. మసీదు ప్రాంగణంలో పురావస్తు శాఖతో కలిసి వాస్తవాలను గుర్తించేందుకు సర్వే చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో వీడియో తీసే ప్రయత్నం చేయగా మొదటిరోజు మసీదు నిర్వహణ కమిటీ, ముస్లింల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో మధ్యలో నిలిపేయాల్సి వచ్చింది. అనంతరం వీడియో తీసి సర్వే చేయడానికి కోర్టు అనుమతిచ్చింది.
ఇక అక్కడ బయటపడిన శివలింగాన్ని సంరక్షించాలని హిందూసంస్థలు వేసిన పిటిషన్ ను వారణాసి కోర్టు స్వీకరించింది. అయితే వెంటనే స్పాట్ ను సీల్ చేయమని కమిషనర్ ను ఆదేశించింది. సీఆర్పీఎఫ్ బలగాల్నీ మోహరించారు.