వయసు అనేది కేవలం ఒక సంఖ్య అని.. వడోదరలో జరిగిన 100 మీటర్ల రేసులో హర్యానాకు చెందిన 105 ఏళ్ల వృద్ధురాలు కొత్త రికార్డు సృష్టించి నిరూపించింది. హర్యానాలోని చర్కి దాద్రీకి చెందిన రామ్ బాయి గత వారం నేషనల్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 100 మీటర్ల రేసును కేవలం 45.40 సెకన్లలో పూర్తి చేసింది. జూన్ 15న 100 మీటర్ల రేసులో గెలిచిన తర్వాత ఆమె స్ప్రింట్స్లో గోల్డెన్ డబుల్ని కూడా సాధించింది. ఆ తర్వాత ఆదివారం 1 నిమిషం 52.17 సెకన్లలో 200 మీటర్ల రేసును పూర్తి చేసింది. రామ్ బాయి మొదటి స్థానంలో నిలిచిన రేసులో 85 ఏళ్లు పైబడిన వారు ఎవరూ పాల్గొనలేదు.
తన గ్రామంలో ‘ఉదన్పరి’గా పేరుగాంచిన ఆమె దేశానికి ఎన్నో పతకాలు సాధించింది. ఆమె 2021 నవంబర్ లో పరుగు ప్రారంభించింది, నాలుగు బంగారు పతకాలను గెలుచుకోవడం ద్వారా తన నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.