ఢిల్లీలో లొల్లిపెట్టే బి.కె.యు. బాగోతమిదిగో..!
ఢిల్లీ శివార్లలో హైవేలను దిగ్బంధించి రైతుల పేరుతో ఓ ఆందోళన గత నెల రోజులుగా జరుగుతున్నది. అందులో రైతులు ఎందరు, కమీషన్ ఏజెంట్ల కిరాయి మనుషులు ఎందరు అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే అందరూ రైతులే అనుకున్నా, వ్యవసాయ చట్టాలను ఏకంగా రద్దు చేయాలని డిమాండ్ చేయడమే విచిత్రంగా ఉంది. ఒక చట్టంలో అభ్యంతరకరమైన విషయాలుంటే వాటిని సవరించాలని కోరడం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా జరిగేదే. ఢిల్లీలో కొన్ని రాజకీయ పార్టీల స్పాన్సర్ షిప్ తో నడుస్తున్న ఆందోళనలో మాత్రం మూడు చట్టాలను రద్దు చెయ్యాలనేదే డిమాండ్. భారతీయ కిసాన్ ఈ డిమాండ్ చేయడంలో ముందుంది. కానీ ఇదే యూనియన్, మండీ మోనోపలీ (మార్కెట్ కమిటీ పెత్తనం) వద్దని గత 27 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నది. తరచూ ప్రధాన మంత్రితో పాటు ఇతర పెద్దలకు లేఖలు రాయడం, ప్రకనలు చేయడం అందరికీ తెలిసిందే.
రైతులు సమీపంలోని మార్కెట్ యార్డులోనే పంట ఉత్పత్తులు అమ్మాలనడం దారుణం అనేది బికెయు వాదన. వ్యాపారులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. రైతులు కూడా పంట ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఇవ్వాలని బికెయు డిమాండ్ చేస్తున్నది. ఈ సంస్థ పుట్టిందే రైతుల కోసం. వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలనేదే ప్రధాన నినాదం. అలాంటిది, ఢిల్లీ శివార్లలో ఆందోళన అనే స్పాన్సర్డ్ ప్రోగ్రాంలో బికెయు కూడా ప్రధానంగా పాల్గొంటున్నది. మోడీ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు కూడా బికెయు డిమాండ్ కు అనుగుణంగా ఉన్నాయి. కాబట్టి బికెయు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సింది. కానీ వ్యతిరేకిస్తున్నది. ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. అలా ఎందుకు అంటే జవాబు లేదు. మీరు కోరిందే ప్రభుత్వం చేసింది కదా అనే సమాధానం లేదు. ఈ ఆందోళన వెనుక కర్త, కర్మ, క్రియ, వ్యూహకర్త, అన్నీ నేనే అంటూ నెల రోజుల క్రితం పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రిపబ్లిక్ టీవీ ఇంటర్ వ్యూలో గొప్పగా చెప్పారు. అంటే ఇది ఆయన, ఆయన పార్టీ కాంగ్రెస్ స్పాన్సర్ చేస్తున్న ఉద్యమమా అనే అనుమానాలున్నాయి.
ఢిల్లీ ఆందోళనల్లో మరో ట్విస్టు కూడా ఉంది. వామపక్షాలు ఏలుతున్న కేరళలో వ్యవసాయ ప్రాథమిక మార్కెట్ కమిటీ అనే వ్యవస్థే లేదు. అయినా అక్కడి ప్రభుత్వం, సీఎం, అధికారం పక్షం సమస్తం ఢిల్లీ ఆందోళన జిందాబాద్ అనడం ఆశ్చర్యకరం. మండీ లేని రాష్ట్రంలోని అధికార పార్టీ, మండీ ఉండాలనే ఆందోళనకు మద్దతు ఇవ్వడంలో ఏమైనా అర్థం ఉందా? అని ప్రధాన మంత్రి అడిగితే జవాబు లేదు. ఆందోళన పేరు మీద ఇలాంటి సిత్రాలు చాలానే ఉన్నాయ్.