కాళేశ్వరం… అవినీతి శనేశ్వరం!
ఒక్క ప్రాజెక్టు తెలంగాణను దాదాపుగా దివాళా తీయించింది. అప్పుల మొత్తం నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పెరగడానికి దారిచూపింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తలపెట్టిన ప్రాజెక్టునే అటూ ఇటూ మార్చి, పేరు మార్చేసి, అప్పటికే పూర్తయిన దాదాపు 20 వేల కోట్ల రూపాయల పనులను వదిలేసి కెసిఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు తలపెట్టింది. ఎల్లంపల్లి నీటిని ఎత్తిపోస్తూ కాళేశ్వరం నీళ్లు అని మాయ చేస్తున్నారని పలువురు ప్రతిపక్ష నేతలు ఇప్పటికే ఆరోపించారు. ఈ కేవలం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతి జరిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం నాలుగు ప్యాకేజీల్లోనే 5,662 కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని ఇప్పుడు వెల్లడైంది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బి.హెచ్.ఇ.ఎల్) ఇచ్చిన సమాధానంతో ఈ అక్రమాల బాగోతం బయటకు వచ్చింది. ఈ లెక్కన ఇతర ప్యాకేజీల్లో విదేశీమోటార్ల కొనుగోలులో ఇంకెంత అవినీతి జరిగిందో? కల్వకుంట్ల ప్రభుత్వం తెలంగాణ ప్రజల మీద పగబట్టినట్టు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తోందనే విమర్శలో వంద శాతం వాస్తవం ఉంది. ఇందుకు అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. సంపన్న రాష్ట్రం అయినా, కరోనా పేరుతో ఉద్యోగుల జీతాల్లో అడ్డంగా కోతపెట్టారు. పేద రాష్ట్రాల్లో కూడా ఇలా జీతాలను కోసిన దాఖలాలు లేవు. అంటే ఆర్థిక క్రమశిక్షణ లేదు. అప్పులు పెరిగాయి. పైగా ఉద్యోగులు హాయిగా ఎందుకు ఉండాలనే శాడిజం కూడా సర్కారీ పెద్దల మనసులో ఉందేమో అనిపిస్తుంది. ఇంత దారుణమైన పాలన ప్రపంచంలో మరెక్కడా ఉండేదమో అంటే అతిశయోక్తి కాదు.
కాశేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 6 లో అక్షరాలా 1 వెయ్యి 720 కోట్ల 33 లక్షల రూపాయల లెక్క తేలడం లేదు. ప్యాకేజీ నంబర్ 8 లో 2,018.92 కోట్ల రూపాయలు లెక్కతేలడం లేదు. ప్యాకేజీ నంబర్ 10లో 812.12 కోట్ల రూపాయలు లెక్కతేలడం లేదు. ప్యాకేజీ నంబర్ 11లో మరో 1,110.85 కోట్ల రూపాయలు లెక్క తేలాల్సి ఉంది. ఇదంతా సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు వచ్చిన వాస్తవం. దాదాపు లక్ష కోట్లు ఖర్చయిందని కల్వకుంట్ల వారి ప్రభుత్వం చెప్తున్నది. ఇందులో ఎన్నివేల కోట్ల రూపాయలు స్వాహా అయ్యాయో తేలాలంటే జాతీయ విచారణ సంస్థద్వారా విచారణ చేయించాల్సిన అవసరం ఉంది. కెసిఆర్ ప్రభుత్వం ఇంత భారీ కుంభకోణానికి పాల్పడుతూ బంగార తెలంగాణ సాధించామని చెప్పుకోవడం దారుణం. నిజం బయటకు రావాలి. కాళేశ్వరం మన పాలిట శనేశ్వరం ప్రాజెక్టుగా ఎలా మారింది, ఎవరు బాధ్యులో తేలాలి. వాళ్లు జైలుకు పోవాలి. అది ఎప్పటికైనా జరిగి తీరాల్సిందే.