కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. నేటినుంచి ఈనెల 18 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఈ మేరకు నిబంధనలు, మినహాయిపులకో సర్కారు సర్క్యులర్ జారీ చేసింది. అత్యవసరాలు మినహా మిగిలిన సమయాల్లో కఠినంగా ఆంక్షలు అమలు చేయనుంది. కర్ఫ్యూ సమయంలో వ్యాపార సంస్థలు, దుకాణాలు, సంస్థలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, రెస్టారెంట్లు అన్నీ మూసివేయాల్సి ఉంటుంది. అయితే రోజూ ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే దుకాణాలు, వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు. మిగతా సమయాల్లో పూర్తి కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నారు.
ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్, మెడికల్ షాపులు, ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియా, టెలీకమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, బ్రాడ్ కాస్టింగ్, ఐసీ సర్వీసులు, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ , నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు, కోల్డ్ స్టోరేజ్లతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ పనులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విధుల నిర్వహణకు అనుమతి ఉంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, కోర్టులు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయితీ రాజ్ సంస్థల్లో సిబ్బందికి డ్యూటీ పాస్తో బయటకు వెళ్లే అనుమతి ఉంది. ఆరోగ్య సేవలకు వెళ్లేవాళ్లకు ప్రవైట్ రవాణాకు అనుమతిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వ్యక్తులకు టికెట్ తప్పనిసరిగా ఉండాలి. అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా ప్రజా రవాణాను ఉదయం 6 గంటల్నించి 12 గంటల వరకే అనుమతి ఉంది. ఇక కర్ఫ్యూ లేని సమయంలో సెక్షన్ 144 అమల్లో ఉంటుంది.