కరోనా నుంచి దేశం కోలుకుంటోంది : ప్రధాని నరేంద్ర మోదీ

కరోనా వైరస్‌ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. జనతా కర్ఫ్యూ నుంచి ఇప్పటివరకు ఆయన జాతినుద్దేశించి ప‌లుమార్లు మాట్లాడారు. కాగా ఇది ఏడో ప్ర‌సంగం. ప్ర‌‌ధాని ప్ర‌సంగా ఈ విధంగా సాగింది…
‘‘కరోనా టెస్టింగ్‌ కోసం 2వేల ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. భారత్‌లో ప్రతి 10లక్షల మందిలో ఐదున్నర వేల మందికి మాత్ర‌మే కరోనా సోకింది. మ‌న‌దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుంది. మరణాల రేటు తక్కువగా ఉంది. త్వరలోనే కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటిపోనుంది. ఈ విష‌యంలో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది కృషి ఎంతో ఉంది. కరోనా తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యం చేయ‌కండి. మాస్కులు ధరించకపోతే మ‌నం మ‌ళ్లీ ప్రమాదంలో పడ‌తాం. ప్రపంచమంతా క‌రోనా నియంత్రణ‌ వ్యాక్సిన్‌ కోసం పని చేస్తోంది. సైంటిస్ట్ లు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. కొన్ని మూడో దశ ప్రయోగాల్లో, మ‌రికొన్ని రెండో ద‌శ‌ల్లో ఉన్నాయి. వ్యాక్సిన్ త‌యారై అందుబాటులోకి వచ్చిన వెంట‌నే ప్ర‌తి ఒక్క‌రికీ వ్యాక్సిన్ ఇవ్వ‌డానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. మ‌న‌ ఆర్థిక వ్యవస్థ కూడా నెమ్మదిగా వృద్ధి చెందుతోంది. పెద్ద‌పెద్ద ధ‌నిక దేశాలు కూడా క‌రోనా విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించి భారీ మూల్యం చెల్లించాయి. అమెరికా, బ్రెజిల్‌ లాంటి దేశాల్లో అయితే 10 లక్షల మందిలో 25వేల మంది ఈ వ్యాధి బారినప‌డ్డారు. కానీ మనం జాగ్రత్తలు పాటించ‌డం వ‌ల్ల ఈ మహమ్మారి ప్రభావాన్ని త‌గ్గించ‌గ‌లిగాం. పండుగల సీజన్‌లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలసత్వం వ‌హిస్తే మొద‌టికే మోసం వ‌స్తుంది. మాస్క్‌ ధరించకుంటే మనతో పాటు కుటుంబ సభ్యులను ప్రమాదంలోకి నెట్టిన‌ట్టే. కరోనా వైరస్ పూర్తిగా అంతమయ్యే వరకూ మాస్క్‌లు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. ప్ర‌జ‌లంద‌రినీ సురక్షితంగా చూడాలి అనుకుంటున్నా. అంద‌రూ ఆరోగ్యంగా ఉండండి. అంద‌రికీ దసరా, దీపావళి శుభాకాంక్షలు’’ అని మోదీ ప్ర‌సంగించారు.