ఇది సంస్కృతి సంబంధించిన విషయం – ఎక్కడ ఐలయ్య బోల్తా పడ్డాడు? By Dr.కిరణ్ బొగ్గవరపు

Translated Article for Myindmedia By Bhanu Gouda. The opinion expressed is of the author not necessarily of Myindmedia.

కొన్ని సమస్యల  పరిష్కారానికి కొత్త దృక్కోణం వెదకాలి. కొత్త దృక్కోణం వెదకటానికి మనం గీసుకున్న ఛట్రం  లోంచి బయటపడి ఆలోచించాలి. అవసరమైతే మనదేశాన్ని దాటి బయట ఏమి జరుగుతుందో చూడాలి.

మా రీసెర్చ్ ల్యాబ్ లో ఒక ఆఫ్రికన్ అమెరికన్ ( నల్ల జాతీయురాలు ) నాకింద తన పరిశోధన చేస్తుండేది. డిగ్రీ ఆఖరి సంవత్సరంలో  తన చదువును ఆపేసింది. దానికి కారణం  తానూ గర్భవతినని తెలిసిందట. నాకు ఆలా చివరి సంవత్సరంలో చదువు ఆపేయటం నచ్చలేదు. ఎందుకంటే తన రీసెర్చ్ ప్రాజెక్ట్ ముగించి మాస్టర్స్ డిగ్రీ చేతిలో పడే సమయంలో  అలా మానేయటం దయనీయంగా అనిపించింది

అసలలా ఎందుకు చేసిందో తెలుసుకోవాలని అనిపించింది. ఆవిడ వ్యక్తిగతవిషయాలపై అరా తీయటం నా ఉద్దేశ్యం కాదు, కానీ అలా మాస్టర్స్ డిగ్రీ వదిలివేయడం ఎందుకో తెలుసుకోవాలని  మేరీని ( పేరు మార్చబడినది ) “నీవు గర్భవతివి ఎందుకు అయ్యావు ?. నీ పరిస్థితి చూడు. పెళ్లి చేసుకోలేదు. ఒక వ్యక్తితో కలసి సహజీవనం చేస్తూ గర్భవతివి అయ్యావు. ఆయన నిన్ను పెళ్లిచేసుకోడు. నీకు పుట్టబోయే బిడ్డకు ఏరకమైన సహాయం చెయ్యడు. నీకేమో వుద్యోగం లేదు.ఒక్కదానివే బిడ్డను పెంచటం కష్టం. వీటన్నిటి పైన నీవు మళ్ళి కాలేజీ కి వచ్చి మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేయటం అయ్యేపని కాదు. చదువు లేకపోతె వుద్యోగం రాదు. వుద్యోగం లేకపోతె నీ బిడ్డని పోషించలేవు.  ఇవన్నీ తెలిసిన చదువుకున్నఅమ్మాయివి. తెలిసి తెలిసి ఈ పని ఎందుకు చేసావు ?” అని అడిగాను. నా ఉద్దేశ్యం చదువుపూర్తయ్యాక తాను పిల్లలను కనవచ్చుకదా అని.

ఆవిడ చెప్పిన సమాధానం ఈ రోజుకు నా బుర్రలో తిరుగుతుంది.

“అది నా వైఖరి  ( my attitude ) ” అని చాలా తేలికగా తాను సమాధానం చెప్పింది.

నాకు అది కష్టమైన విషయంగా కనిపించినా తనకి కాదు.  అలాంటి సంస్కృతీ లో ఆమె పెరిగింది. తన తల్లి కూడా ఒంటరిదే. ఇద్దరు అత్తలు ఒంటరి తల్లులే. తన ఇరుగుపొరుగు, తన మిత్రురాండ్ల లో  ఒంటరి తల్లులు వున్నారు. అలా ఒంటరి తల్లిగా జీవితం సాగించటం ఒక అనుకోకుడనిదిగా  తనకి అనిపించటం లేదు. ఆవిడకు అది సహజం గా అనిపించింది.  నిజమే అది పెద్ద సమస్య కాదు. నేను ఆమె జీవితాన్ని చుసిన దృక్కోణంతో తన జీవితాన్ని ఆమె చూడటం లేదు. ఆమె విలువలు నా విలువలు ఒకటి కావు.

ఇదేదో ఒకే ఒక్క సంఘటన అనుకుంటే తప్పు. గణాంకాల ప్రకారం అమెరికా లో  67% ఆఫ్రికన్ అమెరికన్ స్త్రీలు పెళ్లి చేసుకోకుండా పిల్లలను కంటారు. 50% పైగా మగ మరియు  ఆడవాళ్ళు పెళ్లిచేసుకోరు. అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్లు జనాభాలో 14. 5% మాత్రమే కానీ జైళ్లలో వారిసంఖ్య 21%. మాదక ద్రవ్యాలు, దొంగతనాలు మరియు హత్యలు చేసి జైలు శిక్షలు అనుభవిస్తారు. అలాగే  చదువు, వైద్య ఆరోగ్యం  పేదరికం లాంటి విషయాలలో అట్టడుగు స్థానంలో  ఉంటాయి.  అన్నిరకాల అభివృద్ధిని కొలిచే గణాంకాలతో  ఎప్పటికి  వీరిది చివరి స్థానమే.

ప్రభుత్వం ప్రతి ఏటా కొన్ని బిలియన్ల డాలర్లను చదువుపై, వైద్యంపై, చిన్న పిల్లల సంరక్షణపై ఖర్చు పెడుతూనే వుంది. అయినా ఆఫ్రికన్ అమెరికన్ సమాజం దేశంలో జీవన ప్రమాణాల విషయం లో వెనుకబడే వున్నారు.

తరతరాలుగా వారిపై జరిగిన అన్యాయాల మూలంగా, వారిపై జరిగిన వివక్ష మూలంగా(Racial Discrimination), వారిపై చేసిన దాస్యరికం (Slavery) మూలంగా, వారిని వెలివేయటం (Segregation) మూలాన  మాత్రమే వారి పరిస్థితి అలా వుంది  అని చెప్పటం చాలా సులభం. కానీ కేవలం వీటివల్ల  మాత్రమే  వారు వెనకబడి వున్నారు అని చెప్పటం తప్పు. వెనుకబాటుతనానికి  ఇంకా చాలా కారణాలున్నాయి.  అలా అని వారు  వివక్ష, దాస్యత అనుభవించలేదని కాదు,  ప్రభుత్వ విషయంలో సంస్థాగతవివక్ష  సమాజంలో  వ్యవహారవివక్ష  వుంది. దానిపై రూపుమాపటానికి నిరంతర కృషిచేస్తూనే ఉండాలి.

ఆఫ్రికన్ అమెరికన్ సమాజం వృద్ధి చెందక విఫలమవ్వటం వెనుక కేవలం వివక్ష మాత్రమే కాదు చాలా కారణాలు వున్నాయి. ఎందుకు అలా జరిగింది అన్నది  జటిలమైన సమస్య. వారి సమాజం లోని వ్యక్తిగత బాధ్యత లేకపోవడం,వారి విలువలు భిన్నంగా ఉండటం, విచ్ఛిన్నమైన కుటుంబ వ్యవస్థ, పక్కవాడు చేసే ప్రతి పనిని ఆలోచించకుండా  తాము అనుకరించటం, రాజకీయ పార్టీలు వీరిని వాడుకోవటం, చెప్పిందే చెప్పి పరిష్కారం చూడకుండా వివక్ష నే కారణం అని వల్లెవేసే  కొందరు గుడ్డి మేధావులు మాటలు వినటం మూలాన ఆ వర్గం అలానే వుంది.

ఇప్పుడు వివక్ష అనుభవించిన మరొక వర్గం గురించి మాట్లాడుకుందాం.  వారు వేలసంవత్సరాలుగా ప్రతి దేశంలో అణగదొక్కబడ్డారు. వారు నివసించే దేశాలనుండి తరిమివేయబడ్డారు. స్వంతదేశం అంటూ ఒకటి లేక ప్రపంచ దేశాలన్నిటికి తలదాచుకోవటానికి వెళ్లిన వెళ్లిన ప్రతిచోటా వివక్ష ఎదురైంది. 1940 వరకు లక్షల మంది జాతి ప్రక్షాళన కారణంగా చనిపోయారు.

నేను రాస్తున్నది “యాదులు” ( Jews )   గురించి !!!

ఇన్ని కష్టాలున్నప్పటికీ, యాదులు తాము తలదాచుకున్న ప్రతి దేశంలో అభివృద్ధి చెందారు.  అమెరికాలో వారి జనాభా కేవలం 3% మాత్రమే, కానీ ఫోర్బ్స్ 400 మిలియనీర్ల జాబితాలో వారిది 20%.  డబ్బు సంపాదించటం ఒక్కటే కాదు, 30% మంది నోబెల్ బహుమతి గ్రహీతలు యాదులు. ఎంతోమంది యాదులు డాక్టర్లు, ఇంజినీర్లు, సైంటిస్ట్లు, వ్యాపారవేత్తలు, మీడియా లో ప్రముఖులు  గా  వున్నారు.  వారు అంత కష్టాల్లోంచి వచ్చికూడా ఎలా సఫలమయ్యారు ?  దానికి ఎన్నో కారణాలున్నాయి, కానీ ముఖ్యమైన కారణం ఏమిటంటే “వ్యక్తిగత భాద్యత” “చదువు” “కష్టపడే స్వభావం” పై వారు పెట్టె సమయం.

ఒక్క ముక్కలో చెప్పాలంటే అది వారి “సంస్కృతి”

బానిసత్వాన్ని మత వివక్షతో లేదా జాతి వివక్షతో లేదా యాదులపై  జరిగిన వివక్షతో సమానంగా పోల్చటం  తప్పు. కాకపొతే బాధనిని అనుభవించటం అన్నిరకాల వివక్షలలో మరియు బానిసత్వంలో వుంది. పీడించటం వీటన్నిటిలోను కనిపిస్తుంది. అయితే   పీడించబడ్డ వర్గాలు ఎలా ఆ పరిస్థితి నుండి బయటపడ్డాయి ? ఎలా వారు కష్టాలకి సమాధానాలను తయారుచేసుకున్నారు అని ఆలోచిస్తే మనకు ఆ రెండు వర్గాలు ఎంచుకున్న మార్గం సమాధానం చెబుతుంది.

ఆలా సంస్కృతి ముఖ్యపాత్ర వహింస్తుందన్న విషయం  సమర్థనీయంగా లేదా?  సరే ఈ సారి వేరే వర్గాన్ని ఉదాహరణగా తీసుకుందాం. శ్వేతజాతి ప్రొటెస్టెంట్ క్రిస్టియన్లు అమెరికాలో అత్యధికులు.  ఈ వర్గం జాత్యహంకారానికి గాని లేదా మతవివక్షకు గాని గురవలేదు.  కానీ అత్యధిక సంపన్న వర్గంగా పిలవబడుతున్న ఈ  శ్వేతజాతీయుల్లో  (తెల్లవారు)  కూడా “హిల్ బిల్లీస్ “ (Hill Billy) లేదా “రెడ్ నెక్” ( Red Neck ) లేదా వైట్ ట్రాష్ ( White Trash ) అనే వివక్షాపూరిత పదాలతో పిలవబడే వారు చాలామంది వున్నారు. వీరి జీవితాలు మరియు జీవనప్రమాణాలు ఆఫ్రికన్ అమెరికన్ల (నల్లవారు ) కన్నా గొప్పగా లేవు. పైపెచ్చు వారు తెల్ల వారు కావటం మూలాన వారికీ అతి తక్కువ  ప్రభుత్వ సహాయం ఉంటుంది. ఎవరి సహాయం దొరక్క వారి బతుకులేదో వారే దుర్భరంగా బతుకుతారు. వారిలో అత్యధిక శాతం అతి పేదరికంలో, చదువుకోకుండా వుంటారు. చాలా మంది విచ్ఛిన్నమైన కుటుంబాల మధ్య పుట్టి పెరుగుతారు. ఇక్కడా కూడా వారి “సంస్కృతీ” ముఖ్యం అని గమనిస్తే వారిని అర్థం చేసుకోవచ్చు.

ఇక్కడ   ఒక “సంస్కృతి” వేరే  “సంస్కృతి” కన్నా గొప్పదని చెప్పటం తప్పు. ఒక వర్గం వేరే వర్గం కన్నా గొప్ప అని చెప్పటం లేదు.  అలాగే ఇది మతానికి సంబంధించినది కాదు పైన చెప్పిన వర్గాలు అన్ని మతాలలో వున్నారు. మరి ఎలా యాదులు అభివృద్ధి లోకి వచ్చారు ? ఎలా వేరే వర్గాలు రాలేదు? దానికి సమాధానం  విశ్వమానవ విలువలు, సాంస్కృతిక విలువలు. వీటి మూలాన వ్యక్తి , కుటుంబం మరియు సమాజం అభివృద్ధి పథంలోకి వెడతాయి. ఈ విషయం తెలుసుకున్న సామజికవేత్తలు, రాజకీయవిదురులు, సేవా కార్యకర్తలు ఎలా ప్రభుత్వం స్వచ్ఛంద సేవాసంస్థలు కలసి పేదరికాన్ని, మాదక ద్రవ్యాలని, అసమానత్వాన్ని నిర్ములించాలని కృషి చేస్తున్నారు.

అమెరికాలోని వర్గాలకు భారత దేశం లోని అగ్ర కులాలు, వెనుకబడ్డ కులాలు, అట్టడుగున వున్న కులాల మధ్య సారూప్యత వుంది.  రెండు దేశాల  మధ్య సంస్కృతీ వేరైనా,  రెండు దేశాల సమస్యలు వేరైనా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యల్లో చాలా సారూప్యత కనిపిస్తుంది.

ఈ విషయంలో  ప్రొఫెసర్ ఐలయ్య అయన అననూయిలు రాసిన రాతలు తప్పు మాత్రమే కాదు అవి  సమాజాన్ని విడదీసే పని చేస్తాయి. ప్రతిదేశంలో  ప్రతివర్గంలో సంస్కృతి అన్నది ప్రముఖ పాత్ర వహిస్తుందన్న విషయం ఆయనకు తెలియదనుకుంటే పొరపాటు. ఆయనకు సంస్కృతి పాత్ర తెలుసు. తెలిసి అదే సంస్కృతి ని వాడుకొని సామజిక వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. పక్కవారిపై నిందవెయ్యటం తప్ప అయన అభివృద్ధిలోకి రావాలంటే ప్రతిఒక్కరి వ్యక్తిగత బాధ్యత ముఖ్యమని ఎప్పుడు రాయలేదు. పైన చెప్పినట్టుగా యాదులే కానీ ఇంకా ఎవరైనా కానీ అభివృద్ధి చెందాలంటే  వ్యక్తిగత కృషి చాలా ముఖ్యం. ఇలాంటి అతి చిన్న విషయం ఆయనకు తెలియకపోవటం  ఆయనకు ప్రపంచ వ్యవహారాలపై  ఏమాత్రం అవగాహన లేదనే విషయం స్పష్టమవుతుంది. అయన రాతలు తెలియని విషయాలని హ్రస్వదృష్టితో చూసి రాసినవి.

ఐలయ్య లాంటి  వారు ప్రపంచం మారుతుందన్న విషయం గుర్తించటం లేదు. ఆర్థిక వ్యవస్థలు  వ్యవసాయ ఆధారితం నుండి యంత్రాల యుగానికి వెళ్లాయి . ప్రస్తుతం  యంత్రాలనుండి “జ్ఞాన ఆర్థిక వ్యవస్థ” ( Knowledge Based Economy) కు పోతూవుంది.  ఈ ఆధునిక (Modern) కాలం తరువాతి కాలం ( Post Modern ) లో ప్రభుత్వం పాత్ర కేవలం ఉద్యోగాలు ఇచ్చేది కాకుండా, ఉద్యోగాలు ఇచ్చే వారికీ తోడ్పడి మరిన్ని ఉద్యోగాలు తయారుచేసేలా మారుతుంది. రాబోయే కాలంలో ప్రైవేట్ వ్యక్తులు కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి కొత్త ఆర్థిక వ్యవస్థని సృష్టిస్తారు. ఈ మార్పుతప్పక జరుగుతుంది దాన్ని ఎవరు ఆపలేరు.

ఈలాంటి సమయంలో విశ్వమానవ విలువలైన   చదువు, స్వయం కృషి, వ్యక్తిగత బాధ్యత మరింత ప్రాముఖ్యత వహిస్తాయి. ఒక కులంని తిట్టటం వేరే కులంపై విషంకక్కడం లాంటి పనులతో మన స్వంత వైఫల్యాలని కప్పిపుచ్చలేము. ఆలా వేరే వారిని నిందించటం మూలాన మనం సమాజాన్ని మరింత విడదీస్తున్నాం కానీ ప్రగతి సాధించలేము.  అలాగని వివక్షని, దోచుకోవటం గురించి మాట్లాడ కూడదు అంటే తప్పు.  వాటిపై కూడా మాట్లాడాలి.  దాంట్లో ఏమాత్రం సందేహం లేదు.  కాకపొతే ద్వేషపూరిత మరియు విచ్చినకర ఆలోచనలతో మాట్లాడకూడదు. అందరికి సమాన అవకాశాలు కల్పించటం, అందరిని సమానభావం తో చూడటం అందరు కలసి కట్టుగా అభివృద్ధి చెందటం గురించి మాట్లాడాలి.

విచ్ఛిన్నం చేయటం సులభం  అది కొందరితో చేయవచ్చు, కానీ అభివృద్ధి సాధించాలంటే అందరి కృషి సహకారం ఉండాలి

View story at Medium.com